Share News

కరీంనగర్‌ కింగ్‌ బీజేపీ

ABN , Publish Date - Feb 17 , 2026 | 02:01 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో కమలం వికసించింది.

 కరీంనగర్‌ కింగ్‌ బీజేపీ

- మేయర్‌గా కొలగాని శ్రీనివాస్‌

- డిప్యూటీ మేయర్‌ వై సునీల్‌రావు

- చక్రం తిప్పిన కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో కమలం వికసించింది. తెలంగాణలో తొలిసారి ఒక మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 30 డివిజన్లను గెలుచుకోవడమేకాకుండా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను కూడా బీజేపీ కైవసం చేసుకున్నది. మేయర్‌, డిప్యూటీ పదవులు బీజేపీ దక్కకుండా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కూటమి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ వ్యూహాత్మకంగా వేసిన అడుగులు ఆ పార్టీకి విజయాన్ని సాధించి పెట్టాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆపార్టీకి దక్కిన ఏకైక కార్పొరేషన్‌ ఇదే కావడంతో కరీంనగర్‌ బీజేపీకి కీలక కేంద్రంగా మారింది.

- ఇవీ లెక్కలు..

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉన్నాయి. బీజేపీ 30 స్థానాలను, కాంగ్రెస్‌ 14 స్థానాలను, బీఆర్‌ఎస్‌ 9 స్థానాలను గెలుచుకున్నాయి. ఎంఐఎం 3 స్థానాల్లో, ఫార్వర్డ్‌బ్లాక్‌ 2 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 8 స్థానాల్లో గెలుపొందారు. వీరితోపాటు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా నమోదై ఉన్నారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవిని దక్కించుకోవాలంటే మొత్తం సభ్యుల్లో సగానికంటే ఒకరు ఎక్కువగా ఓటు వేయాల్సి ఉంటుంది. మ్యాజిక్‌ ఫిగర్‌ 35 సాధించిన వారికి గెలుపు అవకాశాలు ఉంటాయి.

- బీజేపీకి దక్కకుండా విశ్వప్రయత్నాలు

బీజేపీకి 30 మంది కార్పొరేటర్లతోపాటు ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఓటుకూడా ఉండడంతో వారి బలం 31కి చేరింది. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఫార్వర్డ్‌బ్లాక్‌ సభ్యురాలు బీజేపీకి మద్దతు తెలిపారు. దీంతో 35 సంఖ్యాబలంతో బీజేపీ గెలుపు ఖాయమని అందరూ భావించారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కరీంనగర్‌ కార్పొరేషన్‌ను ఎలాగైనా దక్కించుకోవలసిందేనని జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్‌రావుకు చెప్పడంతో వారు రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, ఫార్వర్డ్‌బ్లాక్‌, ఇండిపెండెంట్‌ సభ్యులతో కలుపుకొని కూటమిగా మారి ఓటింగ్‌లో పాల్గొంటే 35 ఓట్ల సంఖ్యాబలాన్ని సాధించి గెలుపును సొంతం చేసుకోవచ్చని భావించారు. ఇది సాధ్యమైతే బీజేపీ సంఖ్యాబలం 34కు పడిపోతుందని వారు ప్రణాళిక రూపొందించుకొని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒక వైపు బీఆర్‌ఎస్‌తో చర్చలు జరుపుతూ మరోవైపు ఫార్వర్డ్‌బ్లాక్‌ నాయకులతో టచ్‌లోకి వెళ్లారు. ఫార్వర్డ్‌బ్లాక్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు తమ ఇద్దరు సభ్యులకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సమావేశానికి హాజరుకావాలని విప్‌ జారీ చేశారు. అప్పటికే వారిద్దరిలో ఒకరు బీజేపీ క్యాంపులో, మరొకరు కాంగ్రెస్‌ క్యాంపులో ఉన్నారు. ఎవరికి ఓటు వేసే విషయాన్ని ఎన్నికకు ముందు విప్‌ ద్వారా పేర్కొంటామని వారు ప్రకటించారు. ఫార్వర్డ్‌బ్లాక్‌ విప్‌ జారీ చేయడంతో అంతవరకు బీజేపీకి మద్దతు తెలిపిన ఆ పార్టీ కార్పొరేటర్‌ సాయిజ్యోతి కాంగ్రెస్‌ శిబిరంలోకి వెళ్లారు. దీంతో బీజేపీ బలం 34కు పడిపోయింది. కాంగ్రెస్‌కు 14 మంది కార్పొరేటర్లు ఉండగా, బీఆర్‌ఎస్‌కు తొమ్మిది, ఎంఐఎంకు ముగ్గురు, ఫార్వర్డ్‌బ్లాక్‌కు ఇద్దరు, ఇండిపెండెంట్లు ఐదుగురు తోడయ్యారు. దీంతో వారి బలం 35కు చేరింది. అప్పుడు కాంగ్రెస్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు ఎవరైతే బాగుంటుందో తన కార్పొరేటర్లను అడిగి అభిప్రాయ సేకరణ చేసింది. మంత్రుల సమక్షంలో కార్పొరేటర్ల నుంచి మూడు పేర్లు పరిశీలనకు వచ్చాయి. మల్లికార్జున రాజేందర్‌, వైద్యుల అంజన్‌కుమార్‌, ఆకుల నర్మద పేర్లు మేయర్‌ పదవి కావాలనడంతో ఎవరి పేరు ఖరారు చేయాలనే విషయంలో పార్టీ నేతల్లో తర్జనభర్జన జరిగింది. ఆదివారం రాత్రి 11 గంటల వరకు వారు ఎటూ తేల్చక పోవడంతో కాంగ్రెస్‌ శిబిరంలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది.

- చివరి నిమిషంలో మారిన సమీకరణాలు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలయికపై సోషల్‌ మీడియాలో, రాజకీయవర్గాల్లో, ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లలో కొందరు, పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు కొందరు కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడాన్ని వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుకు తెలిపారు. ఆయన ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకవెళ్లడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు పునరాలోచనలో పడ్డారు. కాంగ్రెస్‌ శిబిరంలో మేయర్‌, డిప్యూటీ మేయర్లు ఎవరన్న విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడం, మరోవైపు ప్రజల్లో కూటమిపై వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌కు దూరంగా ఉండడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చిందని సమాచారం.

- ఇండిపెండెంట్‌ను ముందుపెట్టి..

కాంగ్రెస్‌ నుంచి కాకుండా ఇండిపెండెంట్లలో ఒకరిని మేయర్‌ అభ్యర్థిగా నిలిపి ఆయనను గెలిపించడం ద్వారా బీజేపీని అడ్డుకోవచ్చని, బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లు కూడా కాదనే ప్రతిపాదన ఒకటి తెరపైకి వచ్చిందని సమాచారం. 10వ డివిజన్‌ నుంచి గెలిచిన సౌగాని కొమురయ్యను మేయర్‌ అభ్యర్థిగా బరిలో నిలపాలని చర్చించారు. కాంగ్రెస్‌లో కొంత సానుకూలత వ్యక్తమైనా బీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రం ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుందని, పార్టీకి ఇది రాబోయే రోజుల్లో మరింత నష్టం చేకూర్చుతుందని భావించి కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో కూటమి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సోమవారం జరిగిన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థులు ఎన్నికయ్యారు.

- ఓటింగ్‌కు దూరంగా బీఆర్‌ఎస్‌

బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉండగా కాంగ్రెస్‌ ముందుగా చర్చకు వచ్చిన అభ్యర్థులందరిని కాదని కొత్తగా ఆకుల నర్మదను మేయర్‌ అభ్యర్థిగా, హీనా ఆఫ్రీన్‌ను డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా ప్రతిపాదించింది. వీరివురికి 21, 22 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థులకు 34 చొప్పున ఓట్లు వచ్చాయి. ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ తన ఓటు హక్కును వినియోగించుకోగా మానకొండూర్‌ శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఓటింగ్‌లో పాల్గొనలేదు. మరో ఎక్స్‌ అఫీషియో సభ్యుడు, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ సమావేశానికి హాజరుకాలేదు.

- ఒకే ఒక్కడు.. బండి సంజయ్‌

బీజేపీ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు కార్పొరేటర్లుగా గెలిచిన తర్వాత మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక వరకు అన్నీ నిర్ణయాలు తీసుకోవడంలో ఒకేఒక్కడుగా వ్యవహరించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌? ప్రచార బాధ్యతను, ఆర్థికభారాన్ని తనపై వేసుకొని 30 మంది కార్పొరేటర్లను గెలిపించడమే కాకుండా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను సాధించి బీజేపీకి కరీంనగర్‌ కార్పొరేషన్‌ను బండి సంజయ్‌కుమార్‌ కానుకగా ఇచ్చారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ బీజేపీకి దక్కడంతో ఈ పరిణామం రానున్న రోజుల్లో జిల్లా రాజకీయాల్లో కీలకమార్పులకు దారితీసే అవకాశాలున్నాయని, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.

Updated Date - Feb 17 , 2026 | 02:01 AM