Share News

Karimnagar: కలిసి పనిచేస్తేనే కరీంనగర్‌ అభివృద్ధి

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:26 AM

భగత్‌నగర్‌/కరీంనగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలు, పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేస్తే కరీంనగర్‌ అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

 Karimnagar:  కలిసి పనిచేస్తేనే కరీంనగర్‌ అభివృద్ధి

- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

భగత్‌నగర్‌/కరీంనగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలు, పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేస్తే కరీంనగర్‌ అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి, కొత్తపల్లి చెరువుల సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌లోని కొత్తపల్లి, తీగలగుట్టపల్లి, రేకుర్తి చెరువుల పునరుజ్జీవానికి 5.82 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో మెయిన్‌ రోడ్ల నిర్మాణం పూర్తయ్యిందన్నారు. గల్లీల్లో గుంతలు పడ్డ రోడ్లపై దృష్టి సారించామన్నారు. కొత్తపల్లి, తీగలగుట్టపల్లి, రేకుర్తి చెరువులను అమృత్‌ నిధులతో పునరుద్ధరించి మినీ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లంతా కలిసి పని చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు, సుడా ఛైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ పాల్గొన్నారు.

- హుజూరాబాద్‌ డంప్‌ యార్డ్‌పై బీజేపీ యుద్దభేరీ

భగత్‌నగర్‌/హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ డంప్‌ యార్డ్‌పై బీజేపీ ఆధ్వర్యంలో యుద్ధభేరికి సిద్ధం కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్‌ బీజేపీ నాయకులు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ను కలిశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్‌ యార్డ్‌ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయన్నారు. డంపింగ్‌ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. హుజూరాబాద్‌ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదన్నారు. కరీంనగర్‌ డంపింగ్‌ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశామన్నారు. అలాంటి పరిస్థితి ఎవరికీ రావొదన్నారు. హుజూరాబాద్‌ ప్రజల ఆందోళన సహేతుకమైనదని, బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే వెనకడుగు వేయొద్దని, సర్కార్‌ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉదృతంగా పోరాడుతూనే ఉండాలన్నారు. ఉద్యమ సెగ సర్కార్‌ పెద్దలకు తాకే దాకా పోరాడాలన్నారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మన పోరాటాలే వారికి జవాబు కావాలన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 12:26 AM