Share News

Karimnagar: ‘మ్యూల్‌ అకౌంట్ల’పై ఉక్కుపాదం

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:30 AM

కరీంనగర్‌ క్రైం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): కమిషనరేట్‌ పరిధిలోని మ్యూల్‌ అకౌంట్లను గుర్తిస్తున్నామని, సైబర్‌ నేరస్థులకు సహకరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ గౌస్‌ ఆలం హెచ్చరించారు.

Karimnagar:   ‘మ్యూల్‌ అకౌంట్ల’పై ఉక్కుపాదం

కరీంనగర్‌ క్రైం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): కమిషనరేట్‌ పరిధిలోని మ్యూల్‌ అకౌంట్లను గుర్తిస్తున్నామని, సైబర్‌ నేరస్థులకు సహకరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ గౌస్‌ ఆలం హెచ్చరించారు. ఆయన పోలీస్‌ అధికారులతో సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమీషన్లకు ఆశపడి తమ బ్యాంకు ఖాతాలను సైబర్‌ నేరగాళ్లకు అప్పగించిన మ్యూల్‌ అకౌంట్‌దారులను కమిషనరేట్‌ వ్యాప్తంగా గుర్తించామన్నారు. కరీంనగర్‌లోని నాలుగు ప్రధాన బ్యాంకుల్లో మొత్తం 34 మ్యూల్‌ ఖాతాలను గుర్తించామని తెలిపారు. ఇప్పటికే 162 వరకు ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదులు అందినట్లు, ఈ ఖాతాల ద్వారా సైబర్‌ నేరగాళ్లు వెయ్యికి పైగా అక్రమ లావాదేవీలు జరిపినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో 20 కేసులు నమోదు చేయగా, నిందితులపై బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 112 ప్రకారం చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. కొందరు వ్యక్తులు ఏజెంట్లు ఆశజూపే స్వల్ప కమీషన్లకు లోంగి, తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు, వాటికి లింక్‌ అయిన ఫోన్‌ నంబర్లను అపరిచితులకు అందజేస్తున్నారని తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు బాధితుల నుంచి దోచుకున్న సొమ్మును ఇతరుల ఖాతాల్లోకి (మ్యూల్‌ అకౌంట్లు) మళ్లించి, ఆపై తమ అవసరాలకు వాడుకుంటున్నారన్నారు. తెలియని వ్యక్తులకు మీ బ్యాంకు ఖాతాలను ఇవ్వడం లేదా వివరాలు చెప్పడం నేరమని, అలా చేసిన వారిని సైబర్‌ నేరగాళ్లకు సహకరించిన నేరస్థులుగానే పరిగణిస్తామని సీపీ తెలిపారు. అపరిచితులకు బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు, ఓటీపీ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దన్నారు. నెలవారీ కమీషన్లు ఇస్తామంటూ ఖాతాను వినియోగించుకుంటామని చెప్పే వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. బ్యాంకు అధికారుల సమన్వయంతో మ్యూల్‌ ఖాతాదారుల పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, విచారణ వేగవంతం చేసి మిగిలిన నేరస్థులను త్వరలోనే పట్టుకుంటామని సీపీ తెలిపారు.

Updated Date - Mar 06 , 2026 | 12:30 AM