Share News

Karimnagar: జమ్మికుంటలో తీవ్ర ఉద్రిక్తత

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:29 AM

జమ్మికుంట/జమ్మికుంట రూరల్‌, ఫిబ్రవరి 16: (ఆంధ్రజ్యోతి): అనూహ్య మలుపులు, నాటకీయ పరిణామాల మధ్య జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక జరిగింది.

Karimnagar: జమ్మికుంటలో తీవ్ర ఉద్రిక్తత

- చైర్మన్‌గా ఇండిపెండెంట్‌ అభ్యర్థి మొలుగు ప్రశాంత్‌ కుమార్‌ ఎన్నిక

జమ్మికుంట/జమ్మికుంట రూరల్‌, ఫిబ్రవరి 16: (ఆంధ్రజ్యోతి): అనూహ్య మలుపులు, నాటకీయ పరిణామాల మధ్య జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక జరిగింది. 23వ వార్డు నుంచిఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా గెలుపొందిన మొలుగు ప్రశాంత్‌ కుమార్‌ (దిలీప్‌) చైర్మన్‌గా ఎన్నిక కాగా, వైస్‌ చైర్మన్‌గా బీఆర్‌ఎస్‌ సభ్యుడు ముంతాజ్‌ అలీ మహమ్మద్‌ ఎన్నికయ్యారు. ఎస్సీ జనరల్‌కు కేటాయించిన జమ్మికుంట మున్సిపాల్టీకి ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 10, బీఆరెస్‌ 12, బీజేపీ 4, స్వతంత్రులు 3, ఏఐఎఫ్‌బీ అభ్యర్థి ఒకరు గెలుపొందారు. ఫలితాలు వెలువడిన రోజు నుంచే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయు. పది స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌, ముగ్గురు ఇండిపెండెట్లు మొలుగు దిలీప్‌, అతడి సోదరి మొలుగు ప్రణీత, ఫెరోజ్‌తోపాటు ఏఐఎఫ్‌బీ నుంచి గెలుపొందిన బత్తుల లక్ష్మయ్యను కాంగ్రెస్‌ శిబిరానికి తరలించారు. అదే రోజు రాత్రి బీఆర్‌ఎస్‌కు చెందిన మహిళ కౌన్సిలర్‌ కాంగ్రెస్‌ క్యాంపులో చేరగా సభ్యుల సంఖ్య 15కు చేరింది. బీఆర్‌ఎస్‌ 11, బీజేపీకి 4 కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి మొలుగు ప్రశాంత్‌ కుమార్‌ చైర్మన్‌గా ఎన్నిక అవుతారని ప్రచారం మొదలైంది. బీజేపీకి చెందిన నలుగురు బీఆర్‌సకు మద్ధతు తెలుపుతారనే ప్రచారం జోరుగా కొనసాగింది. దీంతో పూటకో మలుపు తిరిగిన చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియలో ఆదివారం అర్ధరాత్రి ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొలుగు ప్రశాంత్‌కుమార్‌, మరో ఇద్దరు ఇండిపెండెట్లు, ఏఐఎఫ్‌బీ కౌన్సిలర్‌ హైద్రాబాద్‌లో కొనసాగుతున్న కాంగ్రెస్‌ క్యాంపు నుంచి కరీంనగర్‌కు చేరుకున్నారు. అర్ధరాత్రి నుంచి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శిబిరాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 10.30 గంటలకు ప్రశాంత్‌కుమార్‌ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకోవడంతో అందరూ అవాక్కయ్యారు. బీఆర్‌ఎస్‌ నుంచి మున్సిపల్‌ చైర్మన్‌గా మొలుగు ప్రశాంత్‌కుమార్‌ ఎన్నికవుతారు అంటూ కొద్ది క్షణాల్లోనే సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అయ్యాయి. ఈ మేరకు మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల అధికారి, హుజూరాబాద్‌ ఆర్డీవో రమేష్‌ నూతన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య చైర్మన్‌ ఎన్నిక సాగింది. తమ క్యాంపు నుంచి చెప్పాపెట్టకుండా బయటకు వెళ్లి ఇప్పుడేలా బీఆర్‌ఎస్‌ వైపు వెళ్లారంటూ చైర్మన్‌ అభ్యర్ధి ప్రశాంత్‌కుమార్‌, ఇతర ఇండిపెండెంట్‌ సభ్యులపై కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వైపు రావాలంటూ వారి చేతులు పట్టుకుని లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీఆరెస్‌, కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ కౌన్సిలర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కౌన్సిలర్లను వారి నుంచి విడిపించి తమవైపు తీసుకెళ్లారు. అధికారులు కలుగచేసుకోని నచ్చచెప్పడంతో గొడువ సద్దుమనిగింది.

ఫ కండువా తీసి ప్రమాణ స్వీకారం చేయాలంటూ కాంగ్రెస్‌ సభ్యుల డిమాండ్‌

ఇండిపెండెంట్‌గా గెలిచిన మొలుగు ప్రశాంత్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుని ఎలా ప్రమాణ స్వీకారం చేస్తాడంటూ కాంగ్రెస్‌ కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అది నిబంధనలకు విరుద్ధమంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో ప్రశాంత్‌ కుమార్‌ కండువా తీసి ప్రమాణ స్వీకారం చేశారు. 12.30గంటలకు చైర్మన్‌ ఎన్నిక నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఒకరు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకరు చైర్మన్‌గా ప్రశాంత్‌కుమార్‌ను ప్రతిపాదించారు. బీఆర్‌ఎస్‌ 12మంది, ఇండిపెండెంట్లు 03, కాంగ్రెస్‌ 10మంది, మొత్తం 25 మంది మద్దతుతో ప్రశాంత్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్‌ చైర్మన్‌గా ముంతాజ్‌ మహమ్మద్‌ అలీని బీఆరెస్‌ నుంచి 12, ఇండిపెండెంట్లు 03, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో ఓటుతో 16మంది ఎన్నుకున్నారు.

ఫ మాజీలను ఓడించి..

జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక పట్టణంలో కొత్త చర్చకు తెరలేపింది. చైర్మన్‌గా ఎన్నికైన ప్రశాంత్‌కుమార్‌ మొన్నటిదాక బీఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగాడు. ఆయనకు 23వ వార్డు నుంచి పార్టీ టికెట్‌ ఇవ్వకుండా మాజీ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు సతీమణి రాధికకు టికెట్‌ కేటాయించారు. దీంతో ఆయన ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి విజయం సాధించి చైర్మన్‌గా ఎన్నిక య్యారు. 19వ వార్డులో తాజా మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ భర్త అయిన కాంగ్రెస్‌ సనియర్‌ నాయకుడు దేశిని కోటి పైన గెలిచి ముంతాజ్‌ మహమ్మద్‌ అలీ (జావిద్‌) వైస్‌ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు.

Updated Date - Feb 17 , 2026 | 12:29 AM