Karimnagar: హుజూరాబాద్ బీఆర్‌ఎస్ కంచుకోట
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:57 PM
జమ్మికుంట, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ బీఆర్‌ఎస్ కంచుకోట అని, ఉప ఎన్నిక మినహా అన్ని ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా ఎగిరిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు
జమ్మికుంట, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ బీఆర్‌ఎస్ కంచుకోట అని, ఉప ఎన్నిక మినహా అన్ని ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా ఎగిరిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్‌లో హుజూరాబాద్ నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ హుజూరాబాద్‌పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. రైతుబంధు, దళితబంధు పథకాలను ఇక్కడి నుండి ప్రారం భిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిక సమయంలో ఇచ్చిన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. రైతు డిస్కంను ఏర్పాటు చేసి వ్యవసాయ విధ్యుత్ సరఫరాను రోజుకు ఆరు గంటలకు పరిమితం చేసే పరిస్థితి వస్తుంద న్నారు. రైతుల అవసరాలకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం ఇతర కార్యక్రమాలు, హెలికాప్టర్ల కొనుగోళ్లకు మాత్రం భారిగా ఖర్చు చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెకొందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. హుజూరాబాద్ డంపింగ్ యార్డు సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని, మేడిగడ్డ మరమ్మత్తులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసే పరిస్థితి లేదని, తిరిగి బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేస్తామన్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డు ఎత్తివేయకపోతే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతు న్నారని తెలిపారు. అప్పుడు హుజూరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు.
మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి మాజీ మంత్రి హరీష్‌రావు ఒక బ్రాండ్ అన్నారు. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు పునరుద్ధరించలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సతీష్‌బాబు, నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్‌లు, నాయకులు తరలివచ్చారు.