Karimnagar : నడిచేదెలా..?
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:59 AM
కరీంనగర్ టౌన, జూన 21 (ఆంధ్రజ్యోతి): నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని స్మార్ట్‌సిటీలో భాగంగా
- యథేచ్చగా ఫుట్‌పాతల ఆక్రమణ
- పట్టించుకోని అధికారులు
- ఇబ్బందుల్లో నగరవాసులు
కరీంనగర్ టౌన, జూన 21 (ఆంధ్రజ్యోతి): నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని స్మార్ట్‌సిటీలో భాగంగా ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రోడ్లలో పాదచారుల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి ఫుట్‌పాతలు నిర్మించారు. కాలనీలు, ఇళ్లు, జనసంచారం పెద్దగా లేని ఎల్‌ఎండీ, బైపాస్‌రోడ్డులోనూ ఫుట్‌పాతలను నిర్మించారు. నగరమంతటా ఫుట్‌పాతలకు చక్కటి రెయిలింగ్ ఏర్పాటు చేశారు. టవర్‌సర్కిల్ లాంటి నిత్యం రద్దీగా ఉండే కొన్ని ప్రాంతాల్లో రోడ్లను విస్తరించకుండా ఇరువైపులా ఫుట్‌పాతలను నిర్మించారు. దీంతో పాదచారులకు బాధలు తప్పాయని అందరూ భావించారు.
ఫ ఎక్కడ చూసినా దుకాణాలే..
ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా కొద్ది దూరం ఫుట్‌పాతలపై నుంచి పాదచారులు నడిచే వీలు లేకుండా ఓవైపు చిరువ్యాపారులు, మరోవైపు దుకాణదారులు, కొన్ని చోట్ల ఇంటి యజమానులు, మరికొన్ని చోట్ల ఇళ్ల ఎదుట ఉన్న ఫుట్‌పాతలను ఆక్రమించుకొని సామాన్లు, బోర్డులు, మిర్చిబండ్లు, టిఫినబండ్లు, పండ్ల దుకాణాలు, పానషాపులు, టీకొట్టులను ఏర్పాటు చేయడంతో నడిచేందుకు ఫుట్‌పాతలే కనిపించకుండా పోయాయి. కొందరైతే మరో అడుగు ముందుకేసి ఫుట్‌పాతకు ఉన్న రెయిలింగ్‌ను తొలగించారు. మరికొందరు ఫుట్‌పాతలను వాహనాల పార్కింగ్ స్థలాలుగా మార్చివేశారు. ఫుట్‌పాతలతోపాటుగా రోడ్డును కూడా ఆక్రమించి దర్జాగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీనికితోడు నగరంలో పార్కింగ్ స్థలాలు లేక పోవడంతో రోడ్లపైనే వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. ఓవైపు రోడ్లు, మరోవైపు ఫుట్‌పాతలన్నీ ఆక్రమణలకు గురవుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆక్రమణలను తొలగించాలంటూ ప్రజలు నగరపాలక సంస్థ అధికారులకు, కలెక్టర్‌కు, పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నా, పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాదచారులు రోడ్లపై నడుస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం ఈ రోడ్ల నుంచి జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు వెళ్తున్నారే కానీ ఆక్రమణలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని పట్టణాలు, నగరాల్లో ఫుట్‌పాతలు నిర్మించకపోవడంతో పాదచారులు ఇబ్బందులు పడుతుంటే కరీంనగర్ కార్పొరేషనలో ఫుట్‌పాతలున్నా కనీసం నడకకు దారిలేకుండా ఆక్రమించుకోవడంతో పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఫుట్‌పాతలపై ఆక్రమణలు తొలగించాలని నగరవాసులు కోరుతున్నారు..
ఫ ఫుట్‌పాతలపై నడవడం పౌరుల ప్రాథమిక హక్కు
రోడ్డు పక్కన ఉన్న ఫుట్‌పాతలపై నడవడం పౌరుల ప్రాథమిక హక్కు అని ఓ కేసులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మోటారు వాహనాల కంటే పాదచారుల నడక హక్కుకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. ఫుట్‌పాతపై నడిచే హక్కుకు భంగం కలిగించినా లేదా నష్టం వాటిల్లినా ప్రభుత్వ సంస్థల నుంచి పౌరులు నష్టపరిహారం పొందవచ్చని సూచించింది. రోడ్డు ఉన్న ప్రతి చోటా సురక్షితమైన ఫుట్‌పాతలను నిర్మించి నిర్వహించడం మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు, పంచాయతీల బాధ్యతగా పేర్కొన్నది. పౌరుల ప్రాథమిక హక్కు అయిన ఫుట్‌పాతలపై నడవడానికి భంగం వాటిల్లితే పరిహారం కోరవచ్చని, ఫుట్‌పాతల నిర్వహణ బాధ్యత పూర్తి అధికారులదేనని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు సూచనల మేరకైనా నగరంలోని రోడ్లు, ఫుట్‌పాతలపై ఉన్న ఆక్రమణలను తొలగించి పౌరుల ప్రాథమిక హక్కుకు భంగం కలుగకుండా చూడాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ అధికారులపై ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.