Share News

Karimnagar: కాలువ నీరు అందేదెలా..?

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:18 AM

సైదాపూర్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మిడ్‌ మానేరు కుడి కాలువ నీరు ఇటీవల విడుదల చేశారు.

 Karimnagar: కాలువ నీరు అందేదెలా..?

- అడుగడుగునా పిచ్చి మొక్కలు

- పట్టించుకోని అధికారులు

సైదాపూర్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మిడ్‌ మానేరు కుడి కాలువ నీరు ఇటీవల విడుదల చేశారు. కాలువలో పిచ్చి మొక్కలు, గడ్డి, చెత్త చెదారం పేరుకుపోవడంతో టెయిల్‌ ఎండ్‌ ప్రాంతాలైన సైదాపూర్‌, ఎల్లంపల్లి, గొడిశాల గ్రామాలకు చెందిన భూములకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్‌ కాలువ పనులు పూర్తి చేయకుండానే మద్యలో వదిలేసి వెళ్లాడు. కాలువలో పిచ్చి మొక్కలు పేరుకుపోవడంతో మండలంలోని ఘనపూర్‌ వరకు మాత్రమే నీరు వస్తున్నాయి.

- ముందుగానే నిధులు విడుదల చేసినా

ఎండలు ముదిరి పంటలు ఎండుతుండడతో సైదాపూర్‌, గొడిశాల, ఎల్లంపల్లి, ఘనపూర్‌ గ్రామాల రైతులు ఘనపూర్‌ వద్ద కాలువలోకి దిగి కాలువలోని పిచ్చి మొక్కలు, గడ్డి, చెత్త తొలగిస్తున్నారు. పిచ్చిమొక్కలు పెద్ద ఎత్తున ఉండడంతో ఆలస్యమవుతోంది. సైదాపూర్‌, చిగురుమామిడి మండలంలోని రైతుల పంటలను కాపాడేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ మిడ్‌ మానేరు కుడి కాలువ మరమ్మతులకు ముందుగానే నిధులు విడుదల చేయించారు. అధికారులు, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో పనులు పూర్తి కాలేదు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించి కాంట్రాక్టర్‌, అధికారులతో మాట్లాడి కాలువ నీళ్లు చివరి వరకు వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:18 AM