Share News

Karimnagar : ‘కో ఆప్షన్‌’పై ఆశలు

ABN , Publish Date - Mar 16 , 2026 | 01:34 AM

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ కో ఆప్షన్‌ సభ్యుల పదవుల కోసం పలువురు నేతలు పావులు కదుపుతున్నారు.

Karimnagar :  ‘కో ఆప్షన్‌’పై ఆశలు

- నేతల చుట్టూ ప్రదక్షిణలు

- త్వరలో ఐదు స్థానాలకు నోటిఫికేషన్‌

- బీజేపీకే ఐదు స్థానాలు దక్కే అవకాశం

కరీంనగర్‌ టౌన్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ కో ఆప్షన్‌ సభ్యుల పదవుల కోసం పలువురు నేతలు పావులు కదుపుతున్నారు. గత నెలలో కొత్తపాలకవర్గాలు కొలువుతీరాయి. మున్సిపల్‌ చట్ట ప్రకారంగా పాలకవర్గ మొదటి సమావేశం, మేయర్‌ ఎన్నిక తర్వాత 30 రోజుల్లో కో ఆప్షన్‌ సభ్యులను తప్పనిసరిగా ఎన్నుకోవలసి ఉంటుంది. నగరపాలక సంస్థ పాలకవర్గంలో ఐదుగురు కో ఆప్షన్‌ సభ్యులు ఉండాలనే నిబంధన ఉంది. ఈ ఐదు కో ఆప్షన్‌ పదవుల్లో రెండు స్థానాలను మైనార్టీలకు, మూడు స్థానాలకు జనరల్‌ కేటగిరీలో ఎన్నుకోవలసి ఉంటుంది. మైనార్టీ కో ఆప్షన్‌ పదవులకు మైనార్టీ వర్గానికి చెందిన ఎవరైనా పోటీచేసే అవకాశముంటుంది. జనరల్‌ మూడు స్థానాలకు మాత్రం మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, మున్సిపాలిటీపై అవగాహన కలిగిన రిటైర్టు అధికారులు, ఉద్యోగుల మాత్రమే పోటీచేసేందుకు అర్హులు. మైనార్టీ కేటగిరిలోని రెండు స్థానాలకు ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బుద్దిస్టులు, పార్శీలు పోటీచేసే అవకాశముంది. దీంతో ఇప్పటికే పలువురు మైనార్టీలు, జనరల్‌ కేటగిరీలో పలువురు మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, రిటైర్డు ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు.

ఏప్రిల్‌ 16లోపు కోఆప్షన్‌ ఎన్నికలు

పాలకవర్గ మొదటి సమావేశం ఫిబ్రవరి 16న ఏర్పాటు చేసి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఏప్రిల్‌ 16వ తేదీలోగా తప్పనిసరిగా కో ఆప్షన్‌ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. నెలరోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో ఎప్పుడైనా నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముంది. దీంతో ఆశావహులు ఆ పదవులను ఎలాగైనా దక్కించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా 30 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలువగా, 14 స్థానాల్లో కాంగ్రెస్‌, 9 స్థానాల్లో బీఆర్‌ఎస్‌, రెండు స్థానాల్లో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌, మూడు స్థానాల్లో ఎంఐఎం, మిగిలిన ఏడు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థి బీజేపీకి మద్దతు ఇవ్వగా మిగిలిన స్వతంత్ర అభ్యరుల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు బీజేపీకే మద్దతు ఇస్తున్నారు.

ఓటింగ్‌లో కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు

కో ఆప్షన్‌ సభ్యులను 66 మంది కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఎన్నుకోవలసి ఉంటుంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో కరీంనగర్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. బీజేపీకి 30 మంది కార్పొరేటర్లు ఉండగా, ఇద్దరు స్వతంత్రులు, ఒక ఫార్వర్డ్‌ బ్లాక్‌ సభ్యుడు ఇప్పటికే మద్దతు ఇచ్చారు. ఎంపీ బండి సంజయ్‌కుమార్‌తో కలిసి ఆ పార్టీ సంఖ్యాబలం 34కు చేరింది. మొత్తం ఐదు కో అప్షన్‌ పదవులు కూడా బీజేపీ బలపరిచిన అభ్యర్థులే గెలిచే అవకాశముంటుంది. దీంతో ఆ పార్టీ టికెట్లు ఆశించి రాని నాయకులు, పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులు, టికెట్లు రాక పోటీలో నుంచి విరమించుకొని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన వారు కో ఆప్షన్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కొందరు సీనియర్‌ ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ రిటైర్డు ఉద్యోగులు కో ఆప్షన్‌ పదవులను ఆశిస్తున్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆశీస్సుల కోసం..

కో ఆప్షన్‌ ఎన్నికలకు నెలరోజుల్లో ఎప్పుడైనా నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముండడంతో ఆశావహులు ఇప్పటికే కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌తోపాటు ముఖ్యనాయకులను కలుసుకొని తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఆశీస్సులు ఉన్నవారే కో ఆఇప్షన్‌ సభ్యులు అయ్యే అవకాశాలుంటాయని భావిస్తున్న ఆశావహులు వారి ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

Updated Date - Mar 16 , 2026 | 01:34 AM