Share News

karimnagar : ఉన్నత విద్య.. ఉపాధి

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:52 AM

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై

karimnagar :  ఉన్నత విద్య.. ఉపాధి

- జూనియర్‌ కాలేజీల్లో ప్లేస్‌మెంట్‌ విభాగాలు

- నైపుణ్యాల పెంపు, ఉద్యోగాల కల్పనే లక్ష్యం

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై వారికి ఇంటర్మీడియట్‌ స్థాయి నుంచే అవగాహన కల్పించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం ప్రతి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్లేస్‌మెంట్‌ విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. ఒక అధ్యాపకుడికి ప్లేస్‌మెంట్‌ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించాలని ఆదేశిస్తూ ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ డైరెక్టర్‌ అభిలాష అభినవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నారు. వీటిలో దాదాపు ఐదువేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించ డమే లక్ష్యంగా లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

కళాశాలల్లో ప్లేస్‌మెంట్‌ కో ఆర్డినేటర్‌

కళాశాలల్లో ప్లేస్‌మెంట్‌ విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక లెక్చరర్‌కు ప్లేస్‌మెంట్‌ కో ఆర్డినేటర్‌ బాధ్యతలను అప్పగిస్తారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఆసక్తి ఉన్న లెక్చరర్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే జిల్లాస్థాయి కో ఆర్డినేటర్లు వారిని ప్లేస్‌మెంట్‌ కో ఆర్డినేటర్లుగా ఎంపిక చేస్తారు. ప్లేస్‌మెంట్‌ కో ఆర్డినేటర్లు స్థానికంగా ఉండే పరిశ్రమల ప్రతినిధులతో సంబంధాలుకొనసాగించి నైపుణ్యాలను విద్యార్థులకు సమకూర్చడం, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అందేలా చూడడం, ఉద్యోగాలతోపాటు ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడం వంటి విధులను నిర్వహి స్తారు. కో ఆర్డినేటర్లు ఆయా కళాశాలల్లోని విద్యార్థుల వివరాలు, వారి ఆసక్తులు, ఉన్నత విద్య లక్ష్యాలు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రత్యేక డేటాబేస్‌ రూపొందిస్తారు. విద్యార్థులకు వారి అభిరుచులు, ఆసక్తికి అనుగుణంగా కేరీర్‌ ప్రణాళికపై నిరంతర మార్గదర్శనం అందించాల్సి ఉంటుంది.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్యపై అవగాహన

కళాశాలల్లో ఏర్పాటు చేసిన ప్లేస్‌మెంట్‌ విభాగాల ద్వారా ఇంటర్మీడియట్‌ పూర్తయ్యాక విద్యార్థులు ఎలాంటి కోర్సును ఎంపిక చేసుకోవాలి, ఏ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయి.. లాంటి అంశాలఅవగాహన కల్పిస్తారు. ఆయా రంగాల నిపుణులతో ప్రత్యేక సదస్సులను నిర్వహించనున్నారు. పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్‌ కంపెనీల సమన్వయంతో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఇందుకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను పరిశ్రమలు, నైపుణ్యభివృద్ధి సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలతో అనుసంధానం చేయనున్నారు.

విద్యార్థులకు ప్రయోజనకరం..

- వి సత్యవర్ధన్‌రావు, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి

కళాశాలల్లో ఏర్పాటు చేయనున్న ప్లేస్‌మెంట్‌ విభాగాలతో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న, చదివిన పూర్వ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రతి కళాశాలలో ప్లేస్‌మెంట్‌ విభాగాలను ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. రెండు, మూడు రోజుల క్రితమే ఇందుకు సంబంధించిన ఉత్వర్వులు అందాయి. దీనికి సంబంధించిన ప్రణాళిక, విధివిధానాలతో ముందుకెళ్తాం.

Updated Date - Aug 03 , 2026 | 12:52 AM