Share News

Karimnagar: ధాన్యం అన్‌లోడింగ్‌ వేగవంతం చేయాలి

ABN , Publish Date - May 11 , 2026 | 11:47 PM

కరీంనగర్‌, మే 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ధాన్యాన్ని కేటాయించిన రైసుమిల్లులో అన్‌లోడింగ్‌ను వేగవంతం చేసి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు.

Karimnagar:  ధాన్యం అన్‌లోడింగ్‌ వేగవంతం చేయాలి

- కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌, మే 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ధాన్యాన్ని కేటాయించిన రైసుమిల్లులో అన్‌లోడింగ్‌ను వేగవంతం చేసి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులు, రైస్‌మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ ప్రతినిధులతో కలెక్టర్‌ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ చిత్రా మిశ్రా మాట్లాడుతూ అధికారులు, మిల్లర్లు, రవాణాదారుల సమన్వయంతోనే కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయవచ్చని అన్నారు. మిల్లర్లు సాధ్యమైనంత మేరకు ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రానున్న రెండువారాల్లో పెద్ద మొత్తంలో ధాన్యం సేకరించాల్సిఉంటుందని, అందుకు తగిన రీతిలో అందరూ సన్నద్ధంగా ఉండాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్‌, పౌరసరఫరాల అధికారి నర్సింగారావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ రజనీకాంత్‌, డీఆర్‌డీవో శ్రీధర్‌, డీసీవో రామానుజాచారి పాల్గొన్నారు.

- ధాన్యం కటింగ్‌ పేరుతో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు

సుభాష్‌నగర్‌: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీపీఎస్‌ విఽధానం కారణంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం ఏర్పడిందని తెలిపారు. కొనుగోళ్ళలో ఆలస్యం, అనవసర కట్టింగ్‌లు లేకుండా రైతుల పక్షాన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు సూచించారు. అదనపు తూకం పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా రైస్‌ మిల్లర్లు ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా చూడాలన్నారు. రైస్‌ మిల్లర్లతో సమావేశం నిర్వహించి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేపడుతున్నామని వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి గింజవరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అన్ని మండలాల్లో ఎంపీడీవోలు, తహసీల్దార్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలును పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అదనపు తూకం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రైతులకు నష్టం జరగకుండా చూస్తామని తెలిపారు. లారీలు, ట్రాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరళిస్తున్నామని కలెక్టర్‌ తెలియచేశారు.

- ప్రజావాణికి 185 దరఖాస్తులు

సుభాష్‌నగర్‌: ప్రజావాణికి 185 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్‌ చిత్రమిశ్రా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ క్షేత్రస్థాయిలోపరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌డీవో మహేశ్వర్‌, జడ్పీసీఈవో శ్రీనివాస్‌, డీఆర్డీవో శ్రీధర్‌, కలెక్టరేట్‌ ఏవో సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2026 | 11:47 PM