Karimnagar: బంగారు పంటలు
ABN , Publish Date - May 21 , 2026 | 11:21 PM
హుజూరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో రైతులు పంటలు పండించడం అంటే కత్తిమీద సాములాంటిది.
- యాసంగిలో హుజూరాబాద్ డివిజన్‌లో అధిక ధాన్యం దిగుబడి
- ముందు చూపుతో పంటలను కాపాడుకున్న రైతులు
హుజూరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో రైతులు పంటలు పండించడం అంటే కత్తిమీద సాములాంటిది. మార్చిలోనే చీడపీడలు ఉధృతంగా ఉంటాయి. భూగర్భజలాలు అడుగంటి, పొలాలు నెర్రలు బారుతాయి. ఈసారి రైతులు ముందస్తుగానే చర్యలు తీసుకుని మడిమడికి పైపుల ద్వారా సాగునీరు అందించి పంటలను కాపాడుకున్నారు. దీంతో హుజూరాబాద్ డివిజనల్‌లో ఈసారి అధిక దిగుబడి వచ్చింది. ప్రతి సంవత్సరం యాసంగి పంట పండిచాలంటే రైతులు అవస్థలు పడేవారు. యాసంగిలో పంట వేసిన తర్వాత పొలాలు పూతకు వచ్చే దశలో సగం పంటలు ఎండిపోయి పశువులకు మేత అయ్యేది. అందుకు భిన్నంగా ఈ సంవత్సరం రైతులు ముందు జాగ్రత్తగా యాసంగి పంటల్లో అధిక దిగుబడుల వచ్చి ధాన్యం రాశులు గలగలలాడాయి. ప్రతి సంవత్సరం 30 శాతానికి పైగా పంట పొలాలు ఎండిపోయేవి. యాసంగిలో పెట్టుబడులు సైతం రైతులకు రాకపోయేవి. అందుకు విరుద్ధంగా ఈ సంవత్సరం పంట పొలాలు కాస్త ముందుగా సాగు చేసిన రైతులు యాసంగిలో అధిక దిగుబడులు సాధించారు. ఈ సంవత్సరం ఎక్కడ చూసిన వరి పొలాలు, ధాన్యం రాశులు కళకళలాడాయి.
ఫ డివిజన్‌లో 80 వేల ఎకరాల్లో వరి
హుజూరాబాద్ డివిజన్‌లో 1.20లక్షల ఎకరాల్లో వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉంది. అందులో 80వేల ఎకరాల్లో వరి, 25వేల ఎకరాల్లో మొక్కజొన్న, 15వేల ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేశారు. అందులో ఆడ, మగ సీడ్‌తో పాటు సాధారణ వరి వేశారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో పాటు ఎలాంటి చీడ పీడలు ఎక్కువగా ఆశించలేదు. దీంతో ఎకరానికి 30నుంచి 33 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. హుజూరాబాద్ డివిజన్‌లోని సైదాపూర్, శంకరపట్నం, హుజూరాబాద్ మండలాల్లో కొంత మేర మెట్ట ప్రాంతం ఉండగా, మిగితా భూములు ఎస్సారెస్పీ ఆయకట్టు కింద ఉన్నాయి. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవడంతో భూగర్భజలాలు పెరిగాయి. దీంతో రైతుల పంటలకు ఆయకట్టు కింద కొరత లేకుండా పోయింది. అధిక మొత్తం దిగుబడులు రావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఫ ఏడెకరాల్లో వరి సాగు చేశా..
- గూడూరు మల్లారెడ్డి, రైతు, ఇప్పల్‌నర్సింగాపూర్
నేను ఈ యాసంగిలో ఎడెకరాల్లో వరి పొలం సాగు చేశాను. ప్రతి ఏటా యాసంగిలో అందులో ఎకరం వరకు నీళ్లు లేక ఎండిపోయేది. ప్రతి మడికి పైపుల ద్వారా సాగునీరు అందించాను. ఒక గుంట పొలం కూడా ఎండిపోలేదు. ఎకరానికి 30నుంచి 33క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ధాన్యం అమ్ముకున్నాను.
ఫ గుంట పొలం కూడా ఎండిపోలేదు.
- పోరెడ్డి కిషన్‌రెడ్డి, రైతు, చిన్నపాపయ్యపల్లి
నేను నాలుగెకరాల్లో వరి సాగు చేశాను. యాసంగిలో ప్రతి ఏడాది సాగునీరు లేక పొలం పారించేందుకు ఇబ్బందులు పడేవాడిని. ఈ సారి వరి పొలాన్ని మడి మడికి పైపులైన్ వేసి పారించాను. గుంట పొలం కూడా ఎండిపోలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి అధిక దిగుబడి వచ్చింది.