Karimnagar: అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి చైర్‌పర్సన్‌గా..
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:27 AM
హుజూరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రొంటాల సుహాసిని హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్.. తన విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ బిజీగా ఉండేవారు..
- హుజూరాబాద్ మున్సిపల్ పీఠంపై రొంటాల సుహాసిని
- వైస్ చైర్‌పర్సన్‌గా గూడూరి అంజలి
హుజూరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రొంటాల సుహాసిని హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్.. తన విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ బిజీగా ఉండేవారు.. ఇంతలో మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. తమ స్వస్థలమైన హుజూరాబాద్‌లో రిజర్వేషన్ అనుకూలించింది.. దీంతో కాంగ్రెస్‌లో చేరారు. 30వ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను 16 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో హుజూరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా రొంటాల సుహాసినిని ఆ పార్టీ సభ్యులు ప్రతిపాదించడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సోమవారం హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో డీఆర్డీవో శ్రీధర్ అధ్యక్షతన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికను నిర్వహించారు. హుజూరాబాద్ మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను 143 మంది పోటీలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి 16 మంది అభ్యర్థులు, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎనిమిది మంది, బీజేపీ నుంచి ఐదుగురు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒకరు ఎన్నికయ్యారు. మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన 16 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికి ఇండిపెండెంట్ అభ్యర్థి గోస్కుల రాజు కాంగ్రెస్‌తో జతకట్టడంతో వారి సంఖ్య 17 మందికి చేరింది. మొదట క్యాంపు నుంచి తరలివచ్చి హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి బస్సులో చేరుకున్న 16 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిం మొత్తం 17 మందితో కోరం నిండింది. ప్రమాణస్వీకారానికి బీజేపీ అభ్యర్థులు హాజరు కాలేదు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎనిమిది మంది బహిష్కరించి వాకౌట్ చేశారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రొంటాల సుహాసినిని 11వ వార్డు అభ్యర్థి జున్నోజు భాస్కర్ ప్రతిపాదించగా, వైస్ చైర్‌పర్సన్‌గా గూడూరి అంజలిని 28వ వార్డు అభ్యర్థి తాళ్లపల్లి రమేష్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో శ్రీధర్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్లను ప్రమాణ స్వీకారం చేయించి పత్రాలను అందజేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్లకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.