Karimnagar : వేసవి సమస్యలపై దృష్టి
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:28 AM
కరీంనగర్ టౌన, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): వేసవికి ముందే ఎండలు మండిపోతున్నాయి.
- విలీన గ్రామాల్లో ప్రారంభమైన తాగునీటి ఇబ్బందులు
- రూ. 49 లక్షలతో యాక్షన ప్లాన సిద్ధం చేస్తున్న బల్దియా
కరీంనగర్ టౌన, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): వేసవికి ముందే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కరీంనగర్‌కు వరప్రదాయిని అయిన లోయర్ మానేరు రిజర్వాయర్ (ఎల్‌ఎండి)లో రోజురోజుకు నీటి మట్టం తగ్గుతోంది.
ఫ 7.873 టీఎంసీలకు పడిపోయిన ఎల్‌ఎండీ నీటిమట్టం
ఎల్‌ఎండీ పూర్తి స్థాయి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.873 టీఎంసీల నీరు నిలువ ఉన్నది. దీంతో నగరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఎల్‌ఎండీలో నీటి నిలువలు తగ్గితే రోజు విడిచి రోజు నీటి సరఫరా చేయడం కూడా కష్టమవుతుంది. బూస్టర్ పంపుసెట్లను ఆనచేసి నీటిని డ్రా చేస్తూ సరఫరా చేస్తే వేసవిలో ఇబ్బందులు తప్పవు. మిడ్‌మానేరు నుంచి నీటిని విడుదల చేస్తే నగర ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. కార్పొరేషనలో కొత్తగా విలీనం చేసిన కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్‌పూర్, మల్కాపూర్ గ్రామాల్లో అప్పుడే మంచినీటి ఇబ్బందులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మార్చి, ఏప్రిల్, మే మూడు మాసాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అప్పుడు నీటి సమస్యను మరింత ఎక్కువ అవుతుందని ఆందోళన చెందుతున్నారు.
ఫ ఎంజీఎఫ్ నిధులతో ప్రతిపాదనలు
నగరపాలక సంస్థ వేసవిలో నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా సమ్మర్ యాక్షన ప్లానను సిద్ధం చేసింది. ఎంజీఎఫ్ నిధులు 49 లక్షలతో వేసవిలో తాగునీటి సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులను నివారించే చర్యలకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. హైలెవల్ జోనలో 7.5 లక్షలు, లోలెవల్ జోనలో 7.5 లక్షలు బోర్‌వెల్స్‌ను రిపేర్ చేసేందుకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. పవర్ బోర్ మోటార్, ఇతర మెటీరియల్‌కు ఆరు లక్షలు, బోరువెల్స్‌ను ప్లంపింగ్, డిపెనింగ్ చేసేందుకు మరో ఆరు లక్షలు, అవసరమైన చోట బావులను అద్దెకు తీసుకునేందుకు రెండు లక్షలు అవసరమవుతాయని అంచనాలు రూపొందించింది. వాల్వ్‌లను కొనుగోలు చేసేందుకు ఆరు లక్షలు, హైలెవల్ పరిధిలో డిసి్ట్రబ్యూషన పైపులైన్లకు ఐదు లక్షలు, లోలెవల్ జోనలో ఐదు లక్షలు, కొత్తపల్లిలో తాగునీరు కోసం తవ్విన బావి పూడిక తీసేందుకు నాలు లక్షలు అవసరమవుతాయని అంచనా వేసిన అధికారులు ఆయా పనులకు పరిపాలన మంజూరీ తీసుకున్నారు. త్వరలో టెండర్లు నిర్వహించి ఆ పనులు పూర్తి చేస్తే కొంత మేరకైనా మంచినీటి సమస్యలనుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుంది.
ఫ ముదురుతున్న ఎండలు
ఓవైపు చలి, మంచు కురుస్తుండగా పగలు ఎండలతో విచిత్రవాతారణం నెలకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరి రెండోవారం నుంచే ఎండల తీవ్రత పెరిగింది. సాధారణ ఉష్ణోగ్రతలు 32, 33 డిగ్రీలకు చేరుకున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు భగ్గుమంటుండడంతో ఎండ తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో మూడు, నాలుగు రోజులుగా కనీస ఉష్ణోగ్రతలు 18, 19 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదవుతుండగా గరిష్ట ఉష్ణోగ్రతలు 32, 33 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. నెలాఖరులోగా ఎండల తీవ్రత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఎండల తీవ్రత అధికమవుతుండడంతో సాగు, తాగునీరు, కరెంటు కష్టాలు తప్పక పోవచ్చని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఎండలు ఈయేడు అధికంగా ఉండే అవకాశాలున్నందున సాగు, తాగునీరు ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.