Karimnagar: చేప పిల్లలకు ’టెండర్ల గండం’
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:41 PM
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్) ‘చేప.. చేప చెరువుకు ఎందుకు చేరలేదంటే.. ఎప్పటిలాగే నాకు టెండర్ల గండం ఎదురైంది’.. అనే పరిస్థితి జిల్లాలో నెలకొంది. మత్స్యకారుల జీవనోపాధికి ఆలంబనగా నిలిచే చెరువుల్లో చేపల పెంపకం ప్రక్రియ జిల్లాలో ఈసారి కూడా ఆలస్యంగానే ప్రారంభమవుతోంది.
- ఈసారీ ఆలస్యంగానే ప్రక్రియ
- కలెక్టరు పర్యవేక్షణలోనే కేటాయింపులు
- ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
‘చేప.. చేప చెరువుకు ఎందుకు చేరలేదంటే.. ఎప్పటిలాగే నాకు టెండర్ల గండం ఎదురైంది’.. అనే పరిస్థితి జిల్లాలో నెలకొంది. మత్స్యకారుల జీవనోపాధికి ఆలంబనగా నిలిచే చెరువుల్లో చేపల పెంపకం ప్రక్రియ జిల్లాలో ఈసారి కూడా ఆలస్యంగానే ప్రారంభమవుతోంది. గతేడాది సెప్టెంబరు నెలదాటినా చిన్ననీటి వనరుల్లోకి చేపపిల్లలు విడుదల చేయలేదు. కాంట్రాక్టర్లు ఆలస్యంగా టెండర్లకు మొగ్గు చూపడంతో విపరీతమైన జాప్యం జరిగింది. ఈసారీ అదే పరిస్థితి నెలకొంది. ప్రతిసారి ఫిర్యాదులు వస్తుండడంతో ఈసారి మత్స్యశాఖ రాష్ట్ర కార్యాలయంతో సంబంధం లేకుండా ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్లకు టెండర్ల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించారు. దీంతో ఈ సారి జిల్లా కేంద్రంలోనే కాంట్రాక్టర్లకు పంపిణీ బాధ్యతల్ని అప్పగించే అవకాశముంది. అందుకనే ఈ సారి జిల్లాలోని ఎల్‌ఎండీ జలాశయంతోపాటు చెరువులకు అవసరమైన చేప పిల్లల్ని సరఫరా చేస్తామని ముగ్గురు కాంట్ర్టార్లు ముందుకొచ్చినట్లు తెలిసింది. వీరికి ఉన్న అవకాశాలు, అర్హతలపై మత్స్యశాఖ అధికారులు ఫీల్డ్‌స్థాయిలో విచారణలు ఇప్పటికే ప్రారంభించారు.
ఫ రెండు కోట్ల చేప పిల్లల పంపిణీ లక్ష్యం
ఈ సారి జిల్లాలో రెండు కోట్ల చేపపిల్లల్ని పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. 196 మత్స్యసహకార సంఘాల పరిధిలో 1,510 చెరువులున్నాయి. రోహు, బొచ్చ, మ్రిగలా, బంగారుతీగ రకాల పిల్లల్ని వదలనున్నారు. 80 నుంచి 100 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నవి 45 లక్షలు, 35 నుంచి 40 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నవి కోటికిపైగా పిల్లల్ని టెండర్ దక్కించుకున్న వారు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 2.15 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సకాలంలో పంపిణీ చేయకుండా ఆలస్యంగా చేయడం వల్ల నాణ్యమైన పిల్లలు వస్తలేవని మత్స్యకారులు అంటున్నారు. జూన్‌లో టెండర్లు నిర్వహించి అప్పటి నుంచి పంపిణీ చేస్తేనే సరిగ్గా పెరిగే అవకాశముంటుంది. అదను దాటిన తరువాత టెండర్లు పిలవడం, తరువాత కొన్ని రోజులకు విడతల వారీగా చెరువుల్లోకి చేప పిల్లలు వదలడం వల్ల అనుకున్న విధంగా ఉత్పత్తి రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు.
ఫ పంపిణీ పారదర్శకంగా నిర్వహిస్తేనే..
దాదాపుగా పదేళ్లుగా చెరువుల్లో ఉచితంగా పెంచుతున్న చేపల వల్ల మత్స్యకారుల జీవనోపాధి, ఆర్థిక ప్రగతి మెరుగవుతోంది. గతంలో జిల్లాలో నిర్ణీత లక్ష్యానికి తగినట్లుగా చేపపిల్లల్ని చెరువుల్లో వదలకపోవడం వల్ల 60 శాతం మేర తక్కువ ఉత్పత్తి జరిగింది. అనుకున్న విధంగా ఆదాయం సమకూరలేదు. కాంట్రాక్టర్లు చేపల పంపిణీలో మాయాజాలం చేశారనే ఆరోపణల్ని మత్స్యకారులు బహిరంగంగానే వినిపించారు. అత్యంత చిన్న సైజు పిల్లల్ని చెరువుల్లో వదలడం వల్ల వాటి పెరుగుదల సరిగ్గా ఉండడం లేదు. వాతావరణం అనుకూలించక చాలావరకు మృత్యువాత పడుతున్నాయి. 2020లో 7,220 టన్నుల ఉత్పత్తి వచ్చింది. అయితే 2022-23లో 11,173 టన్నుల లక్ష్యం పెట్టుకుని పంపిణీకి శ్రీకారం చుట్టారు. 8,126 టన్నుల ఉత్పత్తి వచ్చింది. గత ఏడాది కూడా లోటు ఉత్పత్తి వల్ల అనుకున్న ఆదాయం మత్స్యకారులకు లభించలేదు. ఇదే సమయంలో మత్స్యశాఖ అధికారుల ప్రయత్నం కూడా వృధా అయ్యింది. ఈ సారి అలాంటి గోల్‌మాల్ వ్యవహారాలు, అక్రమాలకు తావివ్వకుండా చెరువుల్లో చేపల పంపిణీ ప్రకియ్రను పారదర్శకంగా నిర్వహించాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఈ దిశగా యంత్రాంగం స్పందించి పర్యవేక్షణను పక్కాగా పెంచి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం జిల్లాల్లో కనిపిస్తోంది.