Karimnagar: రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలి
ABN , Publish Date - May 04 , 2026 | 11:55 PM
Karimnagar: రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలి
- జిల్లా వ్యవసాయధికారి భాగ్యలక్ష్మి
తిమ్మాపూర్, మే 4 (ఆంధ్రజ్యోతి): రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని, అధిక మోతాదులో వాడకూడదని జిల్లా వ్యవసాధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని మండలంలోని మల్లాపూర్, తిమ్మాపూర్, రేణికుంట, నుస్తులాపూర్, పర్లపల్లి గ్రామాల్లోని రైతు వేదికల్లో నిర్వహించారు. మల్లాపూర్ రైతు వేదికలో జరిగిన కార్యక్రమానికి జిల్లా వ్యవసాధికారి భాగ్యలక్ష్మి ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. వానాకాలంలో సాగుకు అనుకూలమైన సన్న రకాల వడ్లు అయిన బీపీటీ 5204, కేఎన్‌ఎం 1638 వంటి రకాల గురించి రైతులకు వివరించారు. యూరియా అధిక మోతాదులో వాడితే జరిగే నష్టాల గురించి రైతులకు తెలియజేశారు. రైతులందరు ఫార్మర్స్ రిజిస్ట్రీ చేసుకోవాలని సూచించారు. నేల ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, పచ్చి రొట్ట ఎరువులు, భూసార పరీక్షల ప్రాధాన్యం గురించి వివరించారు. కార్యక్రమాల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు భూసార కార్డులు, భూసార పరీక్ష విధానం, మట్టి నమూనా సేకరించే విధానం, సమగ్ర పోషక యాజమాన్య పద్దతులు, నానో యూరియా ఇతర లిక్విడ్ ఎరువులు, ప్రోత్సహకాలు, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు బి రాంప్రసాద్, జి ఉషారాణి, రాష్ట్ర నోడల్ అఫిసర్ పి ఈశ్వరయ్య, డీసీవో రామానుజాచార్యులు, జిల్లా నోడల్ అధికారి జలాలుద్దీన్, సీడ్ ఆఫీసర్ మౌనిక, సర్పంచ్ మామిడి మమత, ఏఈవో శ్రావణి పాల్గొన్నారు.