Share News

Karimnagar: మక్కల కొనుగోళ్లపై రైతుల ఆగ్రహం

ABN , Publish Date - May 25 , 2026 | 11:28 PM

కరీంనగర్‌ రూరల్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

 Karimnagar:   మక్కల కొనుగోళ్లపై రైతుల ఆగ్రహం

- నెల రోజులుగా కాంటాల కోసం పడిగాపులు

- వ్యవసాయ మార్కెట్‌కు తాళం

కరీంనగర్‌ రూరల్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్న పండించిన రైతులు మొదటి నుంచే కష్టాలకు గురవుతున్నారు. వాహనాలు, హమాలీల కొరతతో కాంటాలు కాక ఇబ్బందులు పడగా, మరో వైపు గోనె సంచులు రైతులే కొనుగోలు చేసి తీసుకువచ్చినా తూకాలు వేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు సోమవారం కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ ప్రధాన గేటుకు తాళం వేసి దర్నా చేపట్టారు. మక్కలు కొనుగోలు చేయాలని నిరసన చేపట్టారు. వ్యవసాయ మార్కెట్‌ సిబ్బంది, డీసీఎంఎస్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌కు మక్కలు తీసుకువచ్చి కొనుగోళ్లు లేక ఇరవై రోజులుగా అవస్థలు పడుతున్నామన్నారు. లారీల కొరతతో పాటు, హమాలీల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తరుగు ఎక్కువగా తీస్తున్నారని అన్నారు. మార్క్‌ఫెడ్‌ అదికారులు, హమాలీలు, ప్రైవేటు ట్రేడర్స్‌ కుమ్మక్కై తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తులకు అమ్మితే 1800 రూపాయలకు తెచ్చిన రోజే కాంటాలు పెడుతున్నారని అన్నారు. మార్క్‌ఫెడ్‌ జిల్లా మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పాషాయుద్దీన్‌, డీసీఎంఎస్‌ సూపర్‌ వైజర్‌తో రైతులు చర్చలు జరిపారు. ఇక నుంచి హామాలీలను ఎక్కువ మందిని కేటాయించి వెంటవెంట కాంటాలు పెట్టిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Updated Date - May 25 , 2026 | 11:28 PM