Karimnagar: మహిళల ఆరోగ్యంతోనే కటుంబ అభివృద్ధి
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:11 PM
కరీంనగర్ రూరల్; జనవరి 9 (ఆంధ్రజ్యోతి): మహిళలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే వారి కటుంబం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
-కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ రూరల్; జనవరి 9 (ఆంధ్రజ్యోతి): మహిళలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే వారి కటుంబం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ శివారు బొమ్మకల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్ వాడీ కేంద్రం ఆవరణలో మహిళా అభివృద్ది శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సభకు హజరైన కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే వారి అభివృద్ది, తద్వారా కుటుంబ, గ్రామ అభివృద్ది, ఆర్థిక స్థిరత్వం సాధ్యమని అన్నారు. మహిళల సంక్షేమానికి ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రవేశపెట్టి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య మహిళ పరీక్షలతో ముందస్తుగా క్యాన్సర్ కేసులు గుర్తించి చికిత్స అందించిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. శుక్రవారం సభలో మహిళలు వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందవచ్చని సూచించారు. శుక్రవారం సభ ద్వారా మహిళల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నామన్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రైవేటులో డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. లోప పోషణనను నివారించే అన్ని చర్యలు తీసుకుంటారని తెలిపారు. చదువు, ఆరోగ్యంపై శ్రద్ద చూపే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
ఫ ఫిర్యాదుల పెట్టె పరిశీలన
బొమ్మకల్‌లోని జిల్లా పరిషసత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టను కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఫిర్యాదుల పెట్టెను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, వేధింపులకు గురైనా ఈ ఫిర్యాదు పెట్టెలో తమ ఫిర్యాదును నిర్బయంగా వేయవచ్చని సూచించారు. మహిళా పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహణ ఉంటుందని తెలిపారు. వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
ఫ భవిత కేంద్రం పరిశీలన
బొమ్మకల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని భవిత కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కేంద్రంలో ఉన్న దివ్యాంగ విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిలబస్ ప్రకారం దివ్యాంగులకు వివిధ బోధన ఉపకరణాలతో నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. దివ్యాంగుల మానసిక అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. అనంతరం బొమ్మకల్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ జకినపల్లి హరికను కలెక్టర్ సన్మానించారు. బొమ్మకల్ అంగన్వాడీ కేంద్రంలో, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన హారికను అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హారికను ఆదర్శంగా తీసుకోవాలని, ఉద్యోగాల్లో , పోటీ పరీక్షల్లో రాణించాలని కోరారు. కా ర్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్, డీఎంహెచ్‌వో వెంకట రమణ, ఇన్‌చార్జి డీడబ్ల్యూవో సుగుణ, సీడీపీవో సబిత, తహసీల్దార్ రాజేష్, వైద్యశాఖ ప్రొగ్రాం అధికారి సనా, ఐఆర్పీ శ్రీలత పాల్గొన్నారు.