Share News

Karimnagar: మాట నిలబెట్టుకున్నా..

ABN , Publish Date - May 26 , 2026 | 11:32 PM

కరీంనగర్‌టౌన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవిని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తానంటూ

 Karimnagar:  మాట నిలబెట్టుకున్నా..

- 100 రోజుల్లోనే నిధులు తీసుకొచ్చా

- యూసీఎఫ్‌ జాబితాలో కరీంనగర్‌ను చేర్పించేందుకు చాలా కష్టపడ్డాం

- కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, అధికారులకు అభినందనలు

- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌

కరీంనగర్‌టౌన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవిని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తానంటూ తాను ఇచ్చిన మాటను 100 రోజుల్లోనే నిలబెట్టుకున్నానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ చెప్పారు. మంగళవారం కోటి 39 లక్షల రూపాయల అంచనా వ్యయంతో కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ భవనం రెండో అంతస్తు నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ శంకుస్థాపన చేశారు. వీటితో పాటు కార్మిక ఆరోగ్య సంక్షేమ భవన పునరుద్ధరణ, షెడ్ల మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం యూసీఎఫ్‌ స్కీంలో భాగంగా కరీంనగర్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి కోసం రూ. 840 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. యూసీఎఫ్‌ జాబితాలో కరీంనగర్‌ను చేర్చడం తెరవెనుక చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి క్రుతజ్ఝతలు తెలిపారు. కష్టపడి పనిచేసిన జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, అధికారులను అభినందిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం నుంచి కరీంనగర్‌ కార్పొరేషన్‌తో పాటు తన పార్లమెంట్‌ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరీంనగర్‌ కార్పొరేషన్‌ను మోడల్‌ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతా నన్నారు. గతంలో నిధుల్లేక పనులు చేయలేక కార్పొరేటర్లు ఎంతో సతమతమయ్యే వారన్నారు. ఈసారి ఆ సమస్య లేదని, గల్లా ఎగరేసుకుంటూ కార్పొరేటర్లంతా తమ తమ డివిజన్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని సూచించారు. కరీంనగర్‌ శివారు ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు కొనసాగిస్తామని చెప్పారు. డంపింగ్‌ యార్డు కోసం కూడా రూ.80 కోట్లు విడుదలయ్యాయన్నారు. కరీంనగర్‌ సిటీలో పార్కింగ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ను అభివృద్ధి చేయాలని కసితో పనిచేస్తున్నామన్నారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విఫలమైందన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకొచ్చేందుకు బీజేపీ రైతు గోస బీజేపీ భరోసా పేరుతో యాత్రలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌ రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2026 | 11:32 PM