Karimnagar: ఉపాధి హామీ ప్రణాళిక ఖరారు
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:00 AM
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 10 (ఆంద్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకం ఈ నెల1వ తేదీ నుంచి వీబీజీ రాంజీగా మార్పు చేసిన విషయం తెలిసిందే.
- ఏప్రిల్‌లో జిల్లాలో 4,76,768 పనిదినాలు లక్ష్యం
- మూడు నెలలుగా అందని కూలి
- పని ప్రదేశంలో అందని సౌకర్యాలు
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 10 (ఆంద్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకం ఈ నెల1వ తేదీ నుంచి వీబీజీ రాంజీగా మార్పు చేసిన విషయం తెలిసిందే. కొత్త సంవత్సరానికి సంబంధించి పనిదినాలు ఖరారు చేయాల్సి ఉండగా పలు రాష్ర్టాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో పాత ప్రకారం పనిదినాలు కల్పించారు. ఏప్రిల్ నెలలో జిల్లాలో 4,76,768 పని దినాలు లక్ష్యంగా నిర్ణయించారు. 4వ తేదీ వరకు 19,833 పనిదినాలు కల్పించారు. ఈ నెల 31 వరకు లక్ష్యం పూర్తి చేయాల్సి ఉంటుంది. శుక్రవారం రోజు జిల్లా వ్యాప్తంగా 9,273 మంది పనిచేశారు.
ఏప్రిల్ మాసానికి కరీంనగర్ రూరల్ మండలంలో కూలీలకు 21,056 పనిదినాల ప్రణాళిక ఖారారు చేశారు. గత ఆర్థిక సంవత్సరం కరీంనగర్ రూరల్ మండలంలో 82శాతం పనులు పూర్తయ్యాయి. మండలంలో ఉపాధి కూలీలు 7,200మంది ఉండగా 4,638 జాబ్‌కార్డు కలిగి ఉన్నారు. ఇందులో 2,291 మంది పనులకు వెళ్తున్నారు. ఏప్రిల్ నెలలో లక్ష్యంగా పెట్టుకున్న 21,056 పనిదినాల్లో ఏప్రిల్ మొదటి వారంలో కూలీలకు 1,313 పనిదినాలు కల్పించినట్లు అదికారులు తెలిపారు. ప్రస్తుతం రోజుకు 553 మంది కూలీలు మాత్రమే పనులకు హాజరవుతున్నారు. కేంద్రం ప్రస్తుతం ఏడాదికి మొత్తం 125 పనిరోజులు నిర్ణయించగా అది ఇంకా అమలులోకి రాలేదు. ప్రస్తుతం కూలీకి కనీస వేతనం 307 రూపాయలు అందేలా చూస్తున్నారు. నర్సరీల్లో మ్కొలక నీరు పోయడం, ఇంకుడు గుతంతలు తవ్వడం, రోడ్ల పనులు, కుంటల్లో పూడిక తీత పనులను కొనసాగిస్తున్నారు.
- వేతనం అందక ఇబ్బందులు
ఉపాధి కూలీలకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. చివరగా జనవరి 13 నుంచి కూలీలు వేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీ డ బ్బులతోనే ఆదారపడి జీవిస్తున్న వారు ఉన్నారు. మూడు నెలలుగా కూలీ డబ్బుల కోసం పడిగా పులు తప్పడం లేదు. అలాగే ఉపాధి హామీ సిబ్బందికి కూడా వేతనాలు అందడం లేదు. వేసవిలో కూలి కూడా రెండు సంవత్సరాలుగా పెంచడం లేదని కూలీలు పేర్కొం టున్నారు.
-పని ప్రదేశంలో తప్పని తిప్పలు
వేసవిలో పని ప్రదేశంలో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. వారికి సౌకర్యాలు అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు., ప్రతి రోజూ కూలీలు పని ప్రదేశంలో పనులు ప్రారంభించే ముందు ఒక ఫొటో, మళ్లీ నాలు గంటల తరువాత మరో ఫొటో చరవాణిలో తీసి యాప్‌లో నమోదు చేయాలి. దీంతో పనులు పూర్తయినా పని ప్రదేశంలోనే కూలీలు నాలుగు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా కూలీల చిత్రాలు తీసే ఎన్‌ఎంఎంఎస్ యాప్ సరిగా పనిచేయడం లేదు. యాప్‌లో పలు లోపాల కారణంగా పనిప్రదేశం , మస్టర్ ఆప్షన్ కనిపించక కూలీల హాజరు వేయడం లేదు.