Share News

Karimnagar: డంపింగ్‌యార్డును రద్దు చేయాలి

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:59 PM

హుజూరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే డంపింగ్‌యార్డును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయకపోతే బీజేపీ తడాఖా చూపిస్తామని, లాఠీలు, కేసులకు, జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడబోమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

Karimnagar: డంపింగ్‌యార్డును రద్దు చేయాలి

- లాఠీలు, కేసులకు, జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడబోం

- కాంగ్రెస్‌ నేతలు కళ్లు తెరవకపోతే ఇళ్ల ముందు చెత్త వేస్తాం

- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

హుజూరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే డంపింగ్‌యార్డును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయకపోతే బీజేపీ తడాఖా చూపిస్తామని, లాఠీలు, కేసులకు, జైలుకు వెళ్లడానికి కూడా వెనుకాడబోమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం రాత్రి హుజూరాబాద్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతలు కళ్లు తెరిచి డంపింగ్‌యార్డును రద్దు చేయకపోతే వారి ఇళ్ల ముందు చెత్త కుప్పలతో పాటు జంతువుల కలేబరాలను వేస్తామని, ఆ వాసన ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమయ్యేలా చూపిస్తామన్నారు. నెల రోజులుగా హుజూరాబాద్‌ ప్రజలు డంపింగ్‌యార్డు వద్దంటూ నిరసనలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి వినబడడం లేదని ప్రశ్నించారు. డంపింగ్‌యార్డును రద్దు చేసేందుకు మానవ హక్కుల కమిషన్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లను సైతం ఆశ్రయిస్తామన్నారు. త్వరలోనే రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హుజూరాబాద్‌లో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన వెంటనే మొట్ట మొదటిగా వ్యతిరేకించిన వ్యక్తిని తానేనన్నారు. హుజూరాబాద్‌లో డంపింగ్‌యార్డు ఏర్పాటు అయితే యువతకు పిల్లను ఇచ్చే పరిస్థితి లేదని, అంతేకాకుండా ప్రజల అనేక రోగాల బారిన పడుతారన్నారు. బీజేపీ చిత్తశుద్ధితో ఉద్యమిస్తుందని, మా పోరాటాలకు ప్రజలు, ప్రజా సంఘాలు భాగస్వాములు కావాలన్నారు. బీజేపీ ప్రజా ఆందోళన కార్యక్రమానికి ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, తూర్పాటి రాజు, పైళ్ల వెంకట్‌రెడ్డి, కొండాల్‌రెడ్డి, మనోజ్‌, శ్రీనివాస్‌, శశిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 11:59 PM