Karimnagar: ఈ చెత్త మాకొద్దు..
ABN , Publish Date - Apr 06 , 2026 | 11:12 PM
హుజూరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన చెత్తతో హుజూరాబాద్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ మాకొద్దని ప్రజలు అంటున్నారు.
- హుజూరాబాద్‌లో ఉధృతమవుతున్న డంపింగ్‌యార్డు ఉద్యమం
- పట్టించుకోని ప్రభుత్వం
హుజూరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన చెత్తతో హుజూరాబాద్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ మాకొద్దని ప్రజలు అంటున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే డంపింగ్‌యార్డు వద్దేవద్దంటూ దీక్షలు, మానవహారాల రూపంలో నిరసనలు తెలుపుతున్నారు. ప్లాంట్ నుంచి వెలువడే కాలుష్యం వల్ల దుర్వాసనతోపాటు చుట్టూ పక్కల నివసించలేని పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. భూగర్భజాలలు కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు.
- వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్
కరీంనగర్, వరంగల్ కార్పొరేషన్లు, హుస్నాబాద్, పరకాల, చొప్పదండి, జమ్మికుంట, వర్ధన్నపేట, నర్సంపేట తదితర మున్సిపాలిటీల చెత్తను తీసుకువచ్చి హుజూరాబాద్‌లో విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు 23 జూలై, 2022లో అప్పటి ప్రభుత్వం ప్రతిపాదన అడిగింది. దీనికి హుజూరాబాద్ రెవెన్యూ అధికారులు సర్వే జరిపి సర్వే నంబర్ 496లో 23ఎకరాల 20గుంటలు, 270 సర్వే నంబర్‌లో ఎకరం 20గుంటలు మొత్తం 25ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని అప్పటి కలెక్టర్‌కు నివేదికలు అందజేశారు. 19 జూలై, 2024లో రాష్ట్ర ప్రభుత్వం వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌కు అనుమతులు ఇచ్చింది. దీనిపై రెండుసార్లు టెండర్లు నిర్వహించగా, ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న అఖిలపక్ష కమిటీ సభ్యుడు ఎక్కడి నుంచో చెత్తను తీసుకువచ్చి ఇక్కడ వేస్తే ప్రజలు అనారోగ్య పాలవుతారని నిరసనలు మొదలు పెట్టారు. ఈ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్, రైతు సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు సంఘీభావం ప్రకటించారు.
- డంపింగ్‌యార్డుతో పొంచి ఉన్న ముప్పు..
డంపింగ్‌యార్డులో వేసే వ్యర్థ పదార్థాలతో విషయవాయువులు వెలువడి 25 కిలోమీటర్ల మేర పర్యావరణం దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద వరి పంటలు ఎక్కువ మొత్తంలో సాగు చేస్తుంటారు. వర్షాలు కురిసినప్పుడు నీరు భూమిలోకి ఇంకి కలుషితమవుతుంది. దీంతో పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. హుజూరాబాద్‌లో డంపింగ్‌యార్డు నెలకొల్పద్దంటూ రోజు రోజుకు ప్రజా ఉద్యమం ఉధృతంగా మారుతోంది. 3న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హుజూరాబాద్‌లో బంద్ నిర్వహించారు. 7,8వ తేదీల్లో దీక్షలో కూర్చుంటానని ప్రకటించారు.
- డంపింగ్‌యార్డు ప్రతిపాదనను విరమించుకోవాలి..
- తూముల వెంకట్రావ్, రైతు, సిర్సపల్లి
హుజూరాబాద్ మండలం సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేయనున్న డంపింగ్‌యార్డు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలి. పచ్చని పొలాల మధ్యన వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌ను నెలకొల్పడం దారుణం. ఈ ప్లాంట్‌తో పర్యావరణం దెబ్బతింటుంది.
- పర్యావరణం దెబ్బతింటుంది..
- విజయ్‌కుమార్, రైతు, సిర్సపల్లి
వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌తో పర్యావరణం దెబ్బతింటుంది. ఈ ప్లాంట్ నుంచి వెలువడే వ్యర్థపదార్థాలు, రసాయనాలతో ప్రజల అనారోగ్య బారిన పడుతారు. ప్లాంట్ నుంచి వెలువడే కాలుష్యంతో పంటలు దెబ్బతింటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను విరమించుకోవాలి.
- ప్రభుత్వం పునారాలోచించాలి.
- పల్కల ఈశ్వర్‌రెడ్డి, అఖిలపక్ష నాయకుడు, హుజూరాబాద్
వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం పునారాలోచించుకోవాలి. హుజూరాబాద్ పక్కనే ఈ ప్లాంట్‌ను నెలకొల్పడంతో పట్టణ ప్రజలు రోగాల బారిన పడుతారు. ప్రతిరోజు దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. డంపింగ్‌యార్డు రద్దు చేసేంత వరకు ఉద్యమం కొనసాగుతుంది.