Share News

Karimnagar: జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 30 , 2026 | 11:49 PM

కరీంనగర్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో

Karimnagar:  జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

- వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ సంజయ్‌ జాజు

కరీంనగర్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అన్ని జిల్లా కలెక్టర్లును, ఎస్పీలను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి డీజీపీ సీవీ ఆనంద్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ, సీపీలతో వర్షాభావ పరిస్థితులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కరీంనగర్‌ కలెక్టర్‌ చిత్రా మిశ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ప్రాణనష్టం జరగకుండా చూడ డమే మనందరి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. వరదలు, వాగులు, వంకలు, నదులు, లోతట్టు ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. జిల్లాలో 24 గంటలు పనిచేయు కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, స్థానికంగా ఉన్న నాటు పడవలను సిద్ధంగా ఉంచాలని అన్నారు. మత్స్యకారులు, రైతులు, పశువుల కాపరులు నీటి ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్య, విద్యుత్‌, రోడ్లు భవనాలు, నీటి పారుదల శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, అవసర మైన యంత్రాలు, పడవలు, జేసీబీలు, సహాయక బృందాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా పరిస్థితులను బట్టి పాఠశాలలకు సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి ఉంటే జిల్లా అధికారులు వెంటనే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

ఫ పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు డీజీపీ సీపీ ఆనంద్‌ తెలిపారు. డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఎస్పీ ఇన్‌చార్జిగా అన్ని జిల్లాలతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. 12 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు, ఐదు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.అత్యవసర సేవలకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ హైదరాబాద్‌, నిర్మల్‌, ములుగు, భద్రాచలం ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నాయన్నారు. శిథిలావస్థలో ఉన్న పాత భవనాలను గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ సెల్‌. 8782997247గా పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌ఓ స్వామి, అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, జెడ్పి డిప్యూటీ సీఈవో పవన్‌ కుమార్‌, డీపీఓ జగదీశ్వర్‌, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 11:49 PM