Share News

karimnagar : కట్టుతప్పుతున్న క్రమశిక్షణ....

ABN , Publish Date - Jul 13 , 2026 | 01:04 AM

కరీంనగర్‌ క్రైం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ శాఖ అంటే క్రమశిణకు మారుపేరు... కాని కొందరు తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో

karimnagar :  కట్టుతప్పుతున్న క్రమశిక్షణ....

- పోలీసుశాఖలో పెరుగుతున్న అవినీతి..

- సీపీవోలో దాదాపు కోటిన్నర కుంభకోణం

- ట్రాఫిక్‌ స్టేషన్‌లో వసూళ్ల పర్వం

- వరుస ఘటనలతో ఆందోళన...

కరీంనగర్‌ క్రైం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ శాఖ అంటే క్రమశిణకు మారుపేరు... కాని కొందరు తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో కట్టుతప్పుతున్నారు. దీనివల్ల మొత్తం పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు వస్తున్నది. కాసులకు కక్కుర్తిపడి నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయడం, లంచాలు డిమాండ్‌ చేయడం, ఫిర్యాదుదారులతో అమర్యాదగా మాట్లాడడం వంటి క్రమశిక్షణ ఉల్లంఘనలు పరిపాటిగా మారింది

ఫ సీపీవోలో వేతనాలు స్వాహా

పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంలోనే మరణించిన పోలీసు ఉద్యోగుల పేరిట నకిలీ ఐడీలతో వారి వేతనాలు సుమారు కోటిన్నర వరకు కాజేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఏప్రిల్‌లో బయటపడడంతో ఒక హెడ్‌కానిస్టేబుల్‌, రిటైర్డ్‌ ఏవోలతోపాటు మరో ముగ్గురిని వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుండగానే కరీంనగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో 30 లక్షలపైగా స్వాహా చేసిన ఘటన సర్వత్రా అశ్యర్యానికి గురి చేసింది.

ఫ డ్రంకెన్‌ డ్రైవ్‌లో నకిలీ చలాన్లు

కరీంనగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు కన్నంవేసిన ఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో వాహనదారులను కోర్టులో హాజరుపరచి జరిమానాను విధంచేలా చూడాల్సిన కరీంనగర్‌ ట్రాఫిక్‌ స్టేషన్‌లోని ఒకరిద్దరు సిబ్బంది దానికి విరుద్దంగా పట్టుబడిన వాహనదారుల డబ్బులు తీసుకుని నకిలీ చలాన్‌ నెంబర్‌ వేసి ఆ డబ్బులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు బాధ్యులుగా ఒక ఆర్‌ఎస్‌ఐని ట్రాఫిక్‌ విధుల నుంచి తొలగించి హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్డ్‌ చేశారు. ట్రాఫిక్‌ స్టేసన్‌లో డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులను చూసే కోర్టు కానిస్టేబుల్‌, ట్రాఫిక్‌ పీఎస్‌ కానిస్టేబుళ్లపై బదిలీ వేటు పడింది. ఇందులో ఒకరిని సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.

ఫ రోడ్డుకు అడ్డంగా బైక్‌ నిలిపాడని యువకుడిపై దాడి

కరీంనగర్‌ రాంనగర్‌లో ఒక యువకుడు రోడ్డుకు అడ్డంగా బైక్‌ను నిలిపాడని పీటీసీలో విధులు నిర్వహిస్తున్న ఆర్‌ఐ, ఇద్దరు ఆర్‌ఎస్‌ఐలు గొడవపడగా ఆ యువకుడు కర్రతో ఆర్‌ఐ, ఆర్‌ఎస్‌ఐలపై దాడి చేశాడు. తాము పోలీసులమని చెప్పగానే ఆ యువకుడు అక్కడి నుంచి పరిగెత్తి ఓ ఇంటిలో తలదాచుకోగా ఆర్‌ఐ, ఇద్దరు ఆర్‌ఎస్‌ఐలు ఆ యువకుడిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన స్థానికంగా సామాజికమాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు సీపీ నివేదిక పంపించారు. అయితే ఆర్‌ఐలు.. యువకుడిని చితకబాదిన సీసీ కెమెరా పుటేజిని అడ్డంపెట్టుకుని మమ్మల్ని తలా 5 లక్షలు వంతున యువకుడు డిమాండ్‌ చేశాడని, అతనికి డబ్బులు డిమాండ్‌ చేయాలని పీటీసీలో పనిచేస్తున్న తోటి ఇద్దరు ఆర్‌ఎస్‌ఐలే చెప్పినట్లు పోలీసులకు ఆర్‌ఐ ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. పీటీసీ, ఆర్‌ఐ, ఇద్దరు ఆర్‌ఎస్‌ఐలతో వైరం ఉన్న మరో ఇద్దరు ఆర్‌ఎస్‌ఐలు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారని టూటౌన్‌లో కేసు నమోదైంది.

ఫ టాస్క్‌ఫోర్స్‌పై ఆరోపణలు

కొంత కాలం కిందట కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసు అధికారులు, సిబ్బందిపై ఆరోపణలు రావటంతో పోలీస్‌ కమిషనర్‌ 10మందిపైగా ఉంటే టాస్క్‌ఫోర్స్‌ టీంను తొలగించారు. ఇటీవల కరీంనగర్‌ స్పెషల్‌ బ్రాంచిలో పనిచేస్తున్న ఐదుగురిని బదిలీ చేయగా ఒక హెడ్‌కానిస్టేబుల్‌, మరో ఇద్దరు సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయని సమాచారం. జాబ్‌ వెరిఫికేషన్‌లో ఒకరి పేరిట కేసులున్నప్పటికీ ఎలాంటి కేసులు లేవని క్లియరెన్స్‌ ఇచ్చినట్లు హైదరాబాద్‌లో ఇంటెలిజన్స్‌ అధికారుల దృష్టికి రావడంతో ఆ ఉద్యోగిపై బదిలీ వేటు పడిందని ప్రచారం జరుగుతున్నది. టూటౌన్‌లో ఒక మహిళతో దురుసుగా ప్రవర్తించారని ఇద్దరు సిబ్బందిపై బదిలీ వేటపడింది. రెండు రోజుల క్రితం కమిషనరేట్‌లోని ఒక ఎస్‌ఐ భూ వివాదంలో తలదూర్చారంటూ డీజీపీకి బాధితులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కమిషనరేట్‌ పరిధిలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఆరోపణలు వచ్చిన ఒక అధికారి, పలువురు సిబ్బందిపై పోలీస్‌కమిషనర్‌ బదిలీ వేటు వేశారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్రమ ఇసుక రవాణా, బెల్ట్‌ షాపుల నిర్వహణ, గుట్కా, గ్రానైట్‌, మట్టి, కంకర ఓవర్‌లోడ్‌ వంటి అక్రమకార్యకలాపాలు కళ్ల ఎదుటే యథేచ్ఛగా నడుస్తున్నా సంబంధిత పోలీసు అధికారులు ఏనాడు పట్టించుకున్న పాపాన పోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసమంటూ కరీంనగర్‌లో బార్‌లు, వైన్‌షాపుల పర్మిట్‌ రూంల వద్దనే డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టి అడ్డగోలుగా కేసులను నమోదు చేస్తున్నారని, డబ్బులు సమర్పించకున్నవారిని వదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కట్టుతప్పుతున్న పోలీసు అధికారులు, సిబ్బందిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఫ ఇటీవల ఉమ్మడి జిల్లాలోని 373 మంది హోంగార్డులకు పారదర్శకంగా బదిలీలు చేశామని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. బదిలీల వరకు పారదర్శకంగానే ఉండగా సగంమంది వరకే బదిలీ స్థానాలకు రిలీవ్‌ అయ్యారని, మిగతా వారిని రిలీవ్‌ చేసేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోనందున హోంగార్డులు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఒకరిద్దరు బదిలీ అయిన హోంగార్డులు బదిలీ ప్రాంతాలకు వెళ్లి, మళ్లీ పాత స్థానంలోనే పనిచేస్తున్నట్లు సమాచారం. దీనిపై కూడా పోలీస్‌ కమిషనర్‌ దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Jul 13 , 2026 | 01:04 AM