Karimnagar: భక్తులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:52 PM
ఇల్లందకుంట, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఇల్లందకుంట మండల కేంద్రంలోని సీతారామ చంద్రస్వామి దేవాలయంలో
- వృద్ధులు, పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలి
- కలెక్టర్ చిత్రా మిశ్రా
ఇల్లందకుంట, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఇల్లందకుంట మండల కేంద్రంలోని సీతారామ చంద్రస్వామి దేవాలయంలో ఈ నెల 25నుంచి జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. సోమవారం కల్యాణ మండపం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్, అశ్విని తానాజీ వాకడేలు పరిశీలించారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడారు. జాతర సమయంలో వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా చూడాలని అన్నారు. వృద్ధులు, పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. కల్యాణ మండపం వద్ద కూర్చునే భక్తులకు కూలర్లు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. పోలీస్ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఏసీపీ మాధవికి సూచించారు. శానిటేషన్, తాగునీటిపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని, తొక్కిసలాట జరగకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే భక్తులకు స్వామివారి కల్యాణం వీక్షించేలా ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేష్‌బాబు, ఏసీపీ మాధవి, ఎస్‌ఐ క్రాంతికుమార్, తహసీల్దార్ భాస్కర్, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ సయ్యద్ అయాజ్, సర్పంచ్ దార సురేష్, ఎంపీడీవో రాజేశ్వర్‌రావు వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు.