Share News

అందరి సహకారంతో కరీంనగర్‌ అభివృద్ధి

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:03 AM

అందరి సహకారంతో కరీంనగర్‌ రూపురేఖలు మార్చి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

అందరి సహకారంతో కరీంనగర్‌ అభివృద్ధి
రేకుర్తి చెరువు ఆదునీకరణ పనులను ప్రారంభిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్‌కుమార్‌

భగత్‌నగర్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): అందరి సహకారంతో కరీంనగర్‌ రూపురేఖలు మార్చి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. నగరంలోని రేకుర్తి చెరువు సుందరీకరణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్‌ పథకంలో భాగంగా మూడు చెరువుల పునరుజ్జీవం కోసం 5.82 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇందులో భాగంగా 1.98 కోట్ల రూపాయలతో ఈరోజు రేకుర్తి చెరువు పునరుజ్జీవ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. డైన్రేజీ నీరు చెరువులోకి రాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు రేకుర్తి చెరువును అందంగా తీర్చిదిద్ది కరీంనగర్‌ ప్రజలు కుటుంబాలతో కలిసి వచ్చి సేద తీరేలా మినీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. దీంతోపాటు కరీంనగర్‌ గల్లీలోని రోడ్లను నిర్మించాలని నిర్ణయించామన్నారు. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్‌లో గుంతలు పడ్డ అన్ని గల్లీల్లో రోడ్లను నిర్మిస్తామన్నారు. కాళేశ్వరంసహా కేసీఆర్‌ కుటుంబం చేసిన అవినితిని కప్పిపుచ్చేందుకు రేవంత్‌ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని గత ఎన్నికల్లో చెిప్పిన రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొమ్మిది వేల కోట్లకే పరిమితమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాయడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్‌ అవినీతి బయటపడాలంటే లక్ష కోట్ల కాళేశ్వరం నిర్మాణంపై విచారణ జరపాల్సి ఉందన్నారు. రేవంత్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌ ను కాపాడాలనే ఉద్దేశంతోనే డిజైన్‌ లోపాలతో నిర్మించిన మేడగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై మాత్రమే సీబీఐ విచారణ కోరుతున్నారని చెప్పారు. రేవంత్‌కు దమ్ముంటే లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం అవినీతిపై విచారణ కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని సవాల్‌ విసిరారు. కాళేశ్వరం విషయంలో వీళ్లు ఆడుతున్న డ్రామాలపై తెలంగాణ ప్రజలకు త్వరలోనే లేఖ రాస్తామన్నారు. కార్యక్రమంలో మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు, కార్పొరేటర్ల్లు గుగ్గిళ్ల రమేశ్‌, బోయినిపల్లి ప్రవీణ్‌ రావు, బండ రమణారెడ్డి, సుదగోని మాధవి పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2026 | 12:03 AM