Karimnagar: సామాజిక సమానత్వంతోనే అభివృద్ధి
ABN , Publish Date - Feb 05 , 2026 | 12:05 AM
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
- కలెక్టర్ పమేలాసత్పతి
కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ భగత్‌నగర్‌లోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలుకల్పించడమే ఈ దినోత్సవం ముఖ్యోద్ధేశమన్నారు. దివ్యాంగులు, నిరుపేదలందరికి సమాన అవకాశాలు కల్పించాలని, వృద్ధులకు న్యాయం, సేవ అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందకు వెళ్లాలని, బాలికలు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధి అవకాశాలతో ఆర్థిక సాధికారత సాధించాలని అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి బి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని వర్గాలు అభివృద్ధి చెందినపుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. సామాజిక న్యాయ దినోత్సవ ప్రతిజ్ఞ నిర్వహించి, వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం కలెక్టర్ పమేలా సత్పతి హాస్టల్లో విద్యార్థుల కోసం అమర్చిన గీజర్, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, వసతి గృహ సంక్షేమాధికారి శ్రీదేవి పాల్గొన్నారు.
ఫ విద్యార్థుల క్రీడల్లో రాణించాలి
కరీంనగర్ స్పోర్ట్స్,: జిల్లా యంత్రాంగం సమకూరుస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని నిరంతర సాధనతో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాల విద్యార్థులు పోటీల్లో రాణించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. విద్యార్థుల జిమ్నాస్టిక్ సాధనను, పాఠశాలలో వసతులను, సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పోర్ట్స్ స్కూల్‌లో యోగా, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, జూడో వంటి క్రీడల కోసం అవసరమైన పరికరాలను సమకూర్చామని, విద్యార్థులు ఈ సదుపాయాలు వినియోగించుకొని క్రీడారంగంలో మరింత రాణించాలని సూచించారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.