Karimnagar: వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీపీ
ABN , Publish Date - Jul 30 , 2026 | 11:44 PM
కరీంనగర్ క్రైం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): వర్షాలతో కరీంనగర్ పట్టణ శివారులోని తీగల గుట్టపల్లి రైల్వే బ్రిడ్జి, బొమ్మకల్ ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు
- వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని సూచన
కరీంనగర్ క్రైం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): వర్షాలతో కరీంనగర్ పట్టణ శివారులోని తీగల గుట్టపల్లి రైల్వే బ్రిడ్జి, బొమ్మకల్ ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా గురువారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆయా ప్రాంతాలను పరిశీలించారు. వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చోట ట్రాఫిక్ డైవర్షన్‌లు ఏర్పాటు చేయాలని, రెండు వైపులా ట్రాఫిక్ సజావుగా సాగేందుకు తగిన చర్యలు చేపట్టాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలు వాహనాలను నెమ్మదిగా, అప్రమత్తంగా నడపాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ నిరంజన్‌రెడ్డి, ఎస్సై లక్ష్మారెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
- రెండు వారాల సెలవుపై సీపీ
కరీంనగర్ పోలీస్‌కమిషనర్ గౌస్ ఆలం రెండు వారాలపాటు సెలవుపై వెళుతున్నారు. శుక్రవారం నుంచి ఆగస్టు 13 వరకు సెలవు పెట్టారు. అప్పటి వరకు ఇన్‌చార్జి సీపీగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే బాధ్యతలు తీసుకుంటారు.
- రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా
గంగాధర : రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, ప్రతి నెల వారికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశించారు. గురువారం గంగాధర పోలీస్ స్టేషన్‌ను సీపీ వార్షిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ సరైన పద్ధతిలో రికార్డులను నిర్వహించాలని, కేసుల వివరాలు సీసీటీఎన్‌ఎస్‌లో పొందుపర్చాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, గంగాధర ఎస్‌ఐ వంశీకృష్ణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.