Share News

Karimnagar: తగ్గిన పత్తిధర

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:17 AM

జమ్మికుంట, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): పత్తి కొత్త సీజన్‌ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ఈసారి పత్తి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంచింది.

Karimnagar:   తగ్గిన పత్తిధర

- 15 రోజుల్లో రూ. 1,100 తగ్గుదల

- కొత్త సీజన్‌లో రైతుకు నిరాశ

- దిగుమతులు, మిల్లుల కొనుగోళ్లు, నాణ్యతే కీలకం

జమ్మికుంట, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): పత్తి కొత్త సీజన్‌ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ఈసారి పత్తి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంచింది. మార్కెట్‌లో మాత్రం రైతుకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర దక్కడం లేదు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి మోడల్‌ ధర 15 రోజుల్లోనే క్వింటాల్‌కు 1,100 రూపాయల తగ్గడం రైతుల్లో ఆందోళనకు కారణమవుతోంది. సెప్టెంబరు 17న 8,700గా ఉన్న మోడల్‌ ధర అక్టోబరు 1న 7,600 రూపాయలకు పడిపోయింది. ఇదే సమయంలో 2026-27 సీజన్‌కు మధ్య రకం పత్తికి కేంద్రం నిర్ణయించిన ఎంఎస్‌పీ 8,267 అంటే మార్కెట్‌లో నమోదైన మోడల్‌ ధర 667 రూపాయలు తక్కువగా ఉంది. 2025-26లో మధ్య రకం పత్తి ఎంఎస్‌పీ 7,710 ఉండగా, 2026-27 సీజన్‌కు 557 పెంచి 8,267 రూపాయలుగా కేంద్రం నిర్ణయించింది. దీర్ఘ రకం పత్తికి 8,667గా నిర్ణయించింది. కొత్త ధరలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం పత్తి రైతుకు మెరుగైన ధర కల్పించాలనే ఉద్దేశంతో ఎంఎస్‌పీ పెంచినా.. జమ్మికుంటలో తొలి దశ మార్కెట్‌ ధరలు మాత్రం దానికి దిగువనే ఉండడం చర్చనీయాంశంగా మారింది.

ఫ మార్కెట్‌లోకి పంట.. ధరపై ఒత్తిడి

కొత్త పత్తి మార్కెట్‌కు రావడం ప్రారంభమైన సమయంలో ధరలపై ఒత్తిడి కనిపిస్తోంది. పత్తి ధరను నిర్ణయించడంలో లింట్‌ నాణ్యత, తేమ, నారు సన్నదనం, పొడవు, రంగు వంటి అంశాలు కీలకంగా ఉంటాయి. జిన్నింగ్‌ మిల్లులకు రైతు నుంచి వచ్చే పత్తి చివరికి బేళ్లుగా మారినప్పుడు లభించే లింట్‌, పత్తి గింజలకు ఎంత ధర వస్తుంది, జిన్నింగ్‌ ఖర్చులు ఎంత అన్న లెక్కలపై కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి. దీంతో మార్కెట్‌లో రైతు ఆశించే ధర, జిన్నింగ్‌ మిల్లులు చెల్లించేందుకు సిద్ధపడే ధర మధ్య వ్యత్యాసం ఏర్పడే అవకాశం ఉంటుంది. దేశీయ టెక్స్‌టైల్‌, స్పిన్నింగ్‌ పరిశ్రమకు ముడి పత్తి అందుబాటులో ఉంచేందుకు కేంద్రం జూన్‌ 1 నుంచి ఐదు నెలల పాటు పత్తి దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీ మినహాయించింది. ఈ మినహాయింపు అక్టోబరు 31 వరకు కొనసాగనుంది. దేశీయంగా సరఫరా, నాణ్యతలో ఇబ్బందులు ఉన్నప్పుడు మిల్లులకు విదేశీ పత్తి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంటుంది. అదే సమయంలో దిగుమతి పత్తి ధరలు పోటీగా ఉంటే దేశీయ పత్తి కొనుగోళ్లపై ఒత్తిడి ఏర్పడే అవకాశముందని వ్యాపార వర్గాల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫ పత్తి రైతుకు దక్కని ధర ?

పత్తి సీజన్‌ ప్రారంభంలో మార్కెట్‌కు వచ్చే పంట పరిమాణం, జిన్నింగ్‌ మిల్లుల కొనుగోళ్లు, నాణ్యత, తేమ, దేశీయ నిల్వలు, దిగుమతి పత్తి ధర, స్పిన్నింగ్‌ మిల్లుల యార్న్‌ డిమాండ్‌ వంటి అనేక అంశాలు స్థానిక ధరను ప్రభావితం చేస్తాయి. రైతు విక్రయించే పత్తి నేరుగా తుది వినియోగదారుడికి వెళ్లదు. జిన్నింగ్‌ తర్వాత లింట్‌, పత్తి గింజ వేరు అవుతాయి. లింట్‌ బేల్‌గా మారి స్పిన్నింగ్‌ మిల్లులకు చేరుతుంది. అక్కడి నుంచి యార్న్‌, వస్త్ర పరిశ్రమ, ఎగుమతుల వరకు విలువ పెరుగుతుంది. ఈ మొత్తం గొలుసులో ఏ దశలో డిమాండ్‌ బలహీనపడినా దాని ప్రభావం రైతు దక్కే ధరపై పడే అవకాశం ఉంటుంది.

ఫ ఎంఎస్‌పీ అమలుపైనే ఆశలు..

పత్తి ధర ఎంఎస్‌పీకి దిగువన కొనసాగితే రైతులకు ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ కీలకంగా మారనుంది. 2026-27 సీజన్‌కు పత్తి ధర మద్దతు కార్యకలాపాలకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)ను కేంద్రం నోడల్‌ ఏజెన్సీగా నిర్ణయించింది. పత్తి కొనుగోళ్లలో నాణ్యత, తేమ వంటి ప్రమాణాలు కూడా కీలకమే. దీంతో మార్కెట్‌ ధర, ఎంఎస్‌పీ, సీసీఐ కొనుగోళ్లు ఎలా అమలవుతాయన్నదే రానున్న రోజుల్లో జమ్మికుంట పత్తి రైతులకు ప్రధాన అంశంగా మారనుంది. దసరా పండగకు ముందు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. సీసీఐ కొనుగోళ్లలోనూ గ్రేడ్‌ల వారీగా ధరలు అమలవుతుంది. పత్తి నాణ్యతను బట్టి క్వింటాల్‌కు 8,267, 8,367, 8,417, 8,567, 8,617, 8,667 రూపాయలు చెల్లిస్తారు.

Updated Date - Oct 05 , 2026 | 12:17 AM