Share News

Karimnagar : కో ఆప్షన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ

ABN , Publish Date - Apr 10 , 2026 | 01:01 AM

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ కో అప్షన్‌ సభ్యుల ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేశారు.

Karimnagar :  కో ఆప్షన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ

- మూడు జనరల్‌... రెండు మైనార్టీ పదవులు

- ఐదింటిలో రెండు పోస్టులు మహిళలకు

- ఈనెల 16వరకు దరఖాస్తుల స్వీకరణ

- 19 వరకు దరఖాస్తుల పరిశీలన

- పాలకవర్గ నిర్ణయం మేరకు 15 రోజుల్లో ఎన్నికలు

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ కో అప్షన్‌ సభ్యుల ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఐదు కో ఆప్షన్‌ పదవుల కోసం ఈనెల 16 వరకు అర్హత, ఔత్సాహిక వ్యక్తుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. 19 వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి బరిలో ఉన్న వారి పేర్లతో అధికారులు జాబితాను సిద్ధం చేసి పాలకవర్గానికి సమర్పిస్తారు. నోటిఫికేషన్‌ జారీ అయినందున 15 రోజుల్లో పాలకవర్గం నిర్ణయం మేరకు ఎన్నిక తేదీని ఖరారు చేస్తారు. పాలకవర్గం తీసుకున్న నిర్ణయం చేసిన రోజున ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఐదుగురు వ్యక్తుల కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే బ్యాలెట్‌ పద్దతిలో ఓటింగ్‌ నిర్వహించి, అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. పోలింగ్‌లో 66 మంది కార్పొరేటర్లు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఐదు పదవులకు ఐదుగురు మాత్రమే దరఖాస్తు చేసుకుంటే వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఐదు స్థానాల్లో మూడు జనరల్‌, రెండు మైనార్టీలకు, జనరల్‌లో ఒకరు, మైనార్టీ విభాగంలో ఒక మహిళ మొత్తం ఐదింటిలో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలి.

అర్హతలు

నగరపాలక సంస్థలో ఐదుగురు వ్యక్తులను కో ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకునేందుకు సీడీఎంఏ సర్క్యులర్‌ జారీ చేసినట్లు కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జీవోఎంఎస్‌ నంబర్‌ 58 మేరకు మున్సిపల్‌ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం ఉన్న ముగ్గురు వ్యక్తులను వీరిలో ఒకరు మహిళ, ఇద్దరు పురుషులు, మైనార్టీ వర్గానికి చెందిన ఇద్దరు సభ్యులను వీరిలో ఒకరు మహిళ, ఒకరు పురుషుడు కో ఆప్షన్‌ సభ్యులు ఎంపిక చేయాల్సి ఉంటుంది. కో ఆప్షన్‌ సభ్యులుగా పోటీచేసేందుకు నగరపాలక సంస్థ ఓటరు లిస్టులో ఓటరుగా నమోదై ఉండాలి. 21 సంవత్సరాలకు తక్కువ కాకుండా వయసు ఉండాలి. గతంలో చైర్మన్‌, మేయర్‌, వైస్‌ చైర్మన్‌, డిప్యూటీ మేయర్‌, కౌన్సిలర్‌, కార్పొరేటర్‌గా ఐదు సంవత్సరాలకు తక్కువ కాకుండా బాధ్యతలు నిర్వహించి ఉండాలి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని రెవెన్యూ మండల పరిధిలోని ఏ గ్రామపంచాయతీలోనైనా సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యుడిగా ఐదేళ్ల పదవీకాలానికి తక్కువ కాకుండా ఉండాలి. మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ అడ్వకేట్‌గా మూడు సంవత్సరాల సర్వీసు చేసిన వారు లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల్లో గెజిటెడ్‌ పోస్టు హోదాలో పనిచేసి పదవీ విరమణ చేసి, మున్సిపల్‌ పరిపాలనలో, పురపాలకశాఖలో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కలిగి ఉన్న వారు జనరల్‌ స్థానంలో పోటీ చేయవచ్చు. మైనార్టీ కో ఆప్షన్‌ సభ్యులుగా పోటీచేసేందుకు ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, బుద్దిస్టు, పార్సీలై ఉండాలి. నగరపాలక సంస్థ ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండాలి.

కో అప్షన్‌ పదవులపై పలువురి ఆశలు :

నగరపాలక సంస్థలోని ఐదు కో అప్షన్‌ పదవులపై పలువురు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం రానివారు, పోటీచేసి ఓడినవారు, పోటీ నుంచి ఒప్పందం మేరకు తప్పుకున్న వారు, మున్సిపల్‌పై అవగాహన, అనుభవం ఉన్న రిటైర్డుఉద్యోగులు, విలీన గ్రామాల్లోని మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డుసభ్యులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. నగరపాలక సంస్థలో 66 మంది కార్పొరేటర్లు అయిదుగురు సభ్యులను ఎన్నుకుంటారు. బ్యాలెట్‌ పద్దతిలో జరిగే ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. బీజేపీకి 30 మంది సభ్యుల బలం ఉండడంతో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా గెలుపొందే అవకాశాలుంటాయి. కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌ 9, ఎంఐఎం 3, ఇద్దరు ఫార్వర్డుబ్లాక్‌, 10 మంది ఇతరులు కార్పొరేటర్లుగా ఉన్నారు. వీరిలో నలుగురు స్వతంత్రలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీ బలం 34కు చేరింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, ఇతర స్వతంత్రుల మద్దతు కూడగట్టి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

Updated Date - Apr 10 , 2026 | 01:01 AM