Karimnagar: నారాయణపూర్ రిజర్వాయర్ అభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:58 PM
గంగాధర, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని భూసేకరణ ప్రత్యేకాధికారి జె స్వామి కోరారు.
- ముంపు సమస్యలు పరిష్కారిస్తాం
- భూసేకరణ ప్రత్యేకాధికారి జె స్వామి
గంగాధర, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని భూసేకరణ ప్రత్యేకాధికారి జె స్వామి కోరారు. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులతో ప్రజాభిప్రాయ సేకరణ సభను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి జె స్వామి మాట్లాడుతూ రైతులు, ప్రజలు బాగుండాలంటే తాగు, సాగునీరు అవసరమన్నారు. రిజర్వాయర్‌లో నీరు నింపడానికి అందరి ఆమోదంతో మిగిలిన పనులు నిర్వహించుకుందామని తెలిపారు. రిజర్వాయర్ సమస్య, ముంపునకు గురయ్యే ఇళ్లు, వ్యవసాయ భూములకు పరిహారం అందించాలనే గ్రామస్తుల అభిప్రాయాన్ని జిల్లా అధికారులకు నివేదిస్తామన్నారు.
- 12 ఏళ్లుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం..
అంతకు ముందు గ్రామస్తులు తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు. తమ ఇళ్లను ముంపులోకి తీసుకోకుండానే 12 ఏళ్లుగా నీటిని ఎత్తిపోస్తున్నారని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ అధికారులు రావడం, సమావేశాలు నిర్వహించడం తప్ప తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదన్నారు. అధికారులు కొన్ని ఇళ్లకే పరిహారం కోసం నివేదికలు తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామం మొత్తాన్ని ముంపు కింద ప్రకటించి పునరావాసం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామం మొత్తాన్ని ప్రకటించకపోతే చెరువులోకి నీటిని ఎత్తిపోయవద్దని తేల్చి చెప్పారు. అనంతరం ఆర్డీవో షర్మిల, నీటిపారుదల శాఖ ఈఈ బాలక్రిష్ణ, డీఈలు, ఏసీపీ విజయ్‌కుమార్ రిజర్వాయర్ కట్ట, గతంలో గండి పెట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజిత, ఎంపీడీవో రాము,సర్పంచ్ దీకొండ బాబలక్ష్మీమధు, నీటిపారుదల శాఖ డీఈలు, ఏఈలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- రసాభాసగా భూసేకరణ సభ
నారాయణపూర్‌లో నిర్వహించిన భూసేకరణ ప్రజాభిప్రాయ సభ రసాభాసగా మారింది. సభలో ముంపు బాధితులు ఆందోళన చేస్తారన్న సమాచారంతో అధికారులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. గ్రామంలో కొద్దిపాటి ఇళ్లకే పరిహారం నివేదికలు సిద్ధం చేయడంతో మిగతా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పరిహారంరాకుండా అడ్డుకుంటున్నారని కొందరు, కట్ట ఎత్తు, వెడల్పు చేస్తే తమకు నష్టం జరగనుందని మరి కొందరు తమ అభిప్రాయాన్ని అధికారులకు తెలిపారు. ఈ సమయంలో ఇరువురిని పోలీసులు శాంతింపజేశారు. గ్రామానికి ఇంతమంది పోలీసులు ఎన్నడూ రాలేదని, పోలీసుల బందోబస్తుతో సభను నిర్వహించడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.