Share News

Karimnagar : గ్రానైట్‌ అక్రమాలపై సీఐడీ

ABN , Publish Date - May 25 , 2026 | 01:43 AM

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన మైనింగ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జిల్లాలో కలకలం రేపుతోంది.

Karimnagar :  గ్రానైట్‌ అక్రమాలపై సీఐడీ

- ప్రభుత్వ నిర్ణయంతో కలకలం

- బీఆర్‌ఎస్‌ నేతలపైనే గురి అంటూ చర్చ

- అందరి దృష్టి మాజీ మంత్రులు, ఎంపీపైనే

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన మైనింగ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జిల్లాలో కలకలం రేపుతోంది. జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమపై నాడు జీఎస్టీ, టాక్సుల ఎగవేత, అక్రమ రవాణా ఆరోపణలు వచ్చాయి. తాజాగా నకిలీ వేబిల్లులతో గ్రానైట్‌ పాలిష్‌డ్‌ షీట్స్‌ హైదరాబాద్‌కు తరలిస్తూ పట్టుబడ్డారు. ఈ సంఘటనలతో కోట్లాది రూపాయల పన్నుల ఎగవేతలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యుడిని లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పేరు తెరపైకి వస్తున్నది. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు గ్రానైట్‌ పరిశ్రమలో ఉండడం, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో ఉన్న వారి వ్యాపార సంస్థలు దేశవిదేశాల్లో గ్రానైట్‌ వ్యాపారానికి పేరుగాంచడంతో అందరి దృష్టి వారివైపు మళ్లింది.

ఫ జిల్లాలో 320కిపైగా గ్రానైట్‌ సంస్థలు

జిల్లాలో రెండున్నర దశాబ్దాలుగా గ్రానైట్‌ పరిశ్రమ విస్తరించి వేల మందికి ఉపాధి కల్పిస్తున్నది. 320కిపైగా గ్రానైట్‌ సంస్థలు ఇక్కడ ప్రభుత్వం నుంచి స్థలాలను లీజుకు తీసుకొని గ్రానైట్‌ను తవ్వి చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. వందలాది పాలిషింగ్‌ యూనిట్లు ఏర్పడి గ్రానైట్‌ బ్లాక్‌లను కోసి టైల్స్‌గా తయారుచేసి స్థానికంగా విక్రయించడంతోపాటు దేశంలోని పలు రాషా్ట్రలకు సరఫరా చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఎనిమిది గ్రానైట్‌ ఏజెన్సీలు స్థానిక గ్రానైట్‌ క్వారీలలో తవ్వితీసిన గ్రానైట్‌ దిమ్మలను సముద్ర రవాణా ద్వారా చైనాకు పంపించడం 2010 తర్వాతే ప్రారంభమైంది.

ఫ రూ. 124.94 కోట్ల పన్నుల ఎగవేత.. ఆరు రెట్ల ఫెనాల్టీ

2013 సంవత్సరంలో కృష్ణపట్నం ఓడరేవు ద్వారా రవాణా చేసిన గ్రానైట్‌ దిమ్మల పరిమాణాలు నమోదు చేయడంలో అక్రమాలు చేసి ప్రభుత్వ ఖజానాకు 124.94 కోట్ల రూపాయలు గండికొట్టారని ఆరోపణలు వచ్చాయి. సీపోర్టులో ఉన్న స్టాక్‌ను పరిశీలించిన అధికారులు అక్రమాల నిగ్గుతేల్చి 124.94 కోట్ల రూపాయల పన్నులు ఎగవేశారని తేల్చారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఆరు రెట్ల ఫెనాల్టీతో కలిపి 749. 66 కోట్ల రూపాయలు చెల్లించాలని గ్రానైట్‌ రవాణా ఏజెన్సీలను ఆదేశించింది. శ్వేత గ్రానైట్స్‌ సంస్థ 57.77 కోట్లు, శ్వేత ఏజెన్సీస్‌ 4.19 కోట్లు, ఏఎస్‌ షిప్పింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 6,64 కోట్లు, జేఎం బక్షీ కంపెనీ 19. 32 కోట్లు, మైథిలీ ఆదిత్య సంస్థ 33.65 కోట్లు, కేవీఆర్‌ ఏజెన్సీస్‌ 92.38 లక్షలు, అరవింద్‌ గ్రానైట్స్‌ 94.86 లక్షలు, సంధ్యా ఏజెన్సీస్‌ 1.5 కోట్ల రూపాయల పన్నులు ఎగవేసి అక్రమాలకు పాల్పడ్డాయని తేల్చి వీటికి ఆరు రెట్ల ఫెనాల్టీని విధించారు. అప్పుడు ప్రభుత్వం వద్ద అప్పీలు చేసుకొని కొంత మేరకు డబ్బుచెల్లించి ఆయా సంస్థలు మళ్ళీ వ్యాపారాన్ని ప్రారంభించాయి.

ఫ పలువురి ఫిర్యాదు

గ్రానైట్‌ సంస్థల అక్రమాలపై స్థానిక న్యాయవాదులు, ఆనాటి బీజేపీ నేతలు బేతి మహేందర్‌రెడ్డి, ఎ గంగాధర్‌, వైసీపీ నేత సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి మైనింగ్‌ ఉన్నతాధికారులకు జీఎస్టీ, కమర్షియల్‌ టాక్సు అధికారులకు, ఈడీ, ఐటీ తదితర శాఖలకు ఫిర్యాదులు చేశారు. ఫలితం లేక పోవడంతో కేంద్ర గనులశాఖ మంత్రికి, హోంశాఖ మంత్రి అమితషా, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేంద్రానికి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. మరో సీనియర్‌ బీజేపీ నాయకుడు పేరాల శేఖర్‌రావు గ్రానైట్‌ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వంలోని పలువురు నేతలకు ఫిర్యాదులు చేయడంతో కొంత కదలిక వచ్చింది. ఈడీ, విజిలెన్సు, మైనింగ్‌ తదితర సంస్థలు సోదాలు జరిపి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నాయి. విచారణలో ఏమి తేలిందో, ఎవరిపై ఏ చర్యలు తీసుకున్నారో వెళ్లడి కాకుండా చిదంబర రహస్యంగానే మిగిలిపోయింది. ధీనితో న్యాయవాదులు మహేందర్‌రెడ్డి, గంగాధర్‌ మళ్ళీ తమ ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు.

ఫ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కలకలం

ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంతరెడ్డి రాష్ట్రంలో గ్రానైట్‌, ఇసుక తదితర మైనింగ్‌ వ్యవహారాల్లో గత 10 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని వాటిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఐడీ విచారణ జరపాలని నిర్ణయించడంతో జిల్లాలో కలకలం రేకెత్తుతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలకు సంబంధించిన గ్రానైట్‌ సంస్థలు ఉండడంతో ఇది ఏ రాజకీయ మార్పులకు దారితీస్తుందోనని చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారం ఇలా ఉండగానే తాజాగా మరో 100 కోట్ల రూపాయల గ్రానైట్‌ అక్రమ వ్యాపార వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. బోగస్‌ సంస్థ పేరిట ఇన్వాయిస్‌ వేబిల్లులు తయారుచేసి గ్రానైట్‌ పాలిషింగ్‌ టైల్స్‌, షీట్స్‌ హైదరాబాద్‌కు తరలిస్తున్న వ్యవహారం తెలుసుకొని జీఎస్టీ నిఘా విభాగం అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని ఒకరిని అరెస్టు చేసి నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరచారు. ఇలాంటి వ్యవహారాలు ఎన్నో జరుగుతున్నాయని, గ్రానైట్‌ వ్యాపారం నష్టాల్లో ఉందని చెబుతూ ప్రచారం చేస్తూ కోట్లాది రూపాయల పన్నులు ఎగవేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సీఐడీ విచారణలో ఈ అక్రమ వ్యాపారాలపై కూడా నిగ్గుతేల్చాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Updated Date - May 25 , 2026 | 01:43 AM