Karimnagar: కనుల పండువగా చంద్ర రథోత్సవం..
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:59 PM
ఇల్లందకుంట, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో చంద్రరథంపై కొలువుదీరిన స్వామివారిని భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
- భారీగా హాజరై మొక్కులు చెల్లించుకున్న భక్తులు
ఇల్లందకుంట, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో చంద్రరథంపై కొలువుదీరిన స్వామివారిని భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం రాత్రి చంద్రరథంపై కొలువుదీరిన స్వామివారిని శనివారం తెల్లవారు జామునుంచి సాయంత్రం 5గంటల వరకు భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రథయాత్ర కన్నుల పండువగా సాగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు, ఈవో సుధాకర్‌లు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏసీపీ మాధవి పర్యవేక్షణలో రూరల్ సీఐ లక్ష్మినారాయణ, టౌన్ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐలు క్రాంతికుమార్, తిరుపతి బందోబస్తు నిర్వహించారు.
- ప్రజలు సుభిక్షంగా ఉండాలి.
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. చంద్రరథంపై కొలువుదీరిన స్వామివారిని ఆయన దర్శించుకని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రాచలంలో కల్యాణం, పట్టాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయని, ఇక్కడ 13రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయవన్నారు. సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నారు. ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు బండి సంజయ్‌ని శాలువాతో సత్కరించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు.
- ఆలయాభివృద్ధికి కృషి..
- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
సీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. చంద్రరథంపై కొలువుదీరిన స్వామివారిని ఎంపీ ఈటల రాజేందర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు ఎంపీ ఈటల రాజేందర్‌ను శాలువాతో సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్, యూప్ టీవీ సీఈవో పాడి ఉదయ్‌నందన్‌రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్, సర్పంచ్ దార సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.