Share News

Karimnagar: మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:07 AM

కరీంనగర్‌ క్రైం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రాబోయే మున్సిపల్‌ ఎన్నికలకు పోలీసు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం అన్నారు.

Karimnagar:   మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

- నేర సమీక్షా సమావేశంలో సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రాబోయే మున్సిపల్‌ ఎన్నికలకు పోలీసు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం అన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్‌లో బుధవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీసు స్టేషన్లవారీగా పెండింగ్‌ కేసుల పురోగతి, శాంతిభద్రతలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ... మున్సిపాలిటీల పరిధిలోని ప్రాంతాన్ని క్లస్టర్లుగా విభజించాలన్నారు. వార్డులవారీగా పోలీసు కానిస్టేబుళ్లను నియమించాలని ఆదేశించారు. 2024 వరకు పెండింగ్‌లో ఉన్న పాత కేసులు, 2025 సంవత్సరం నమోదైన తీవ్రమైన నేరాల ప్రస్తుత స్థితిగతులను సీపీ సమీక్షించారు. ఆస్తులకు సంబంధించిన, మహిళలపై జరుగుతున్న నేరాలు, అఘాయిత్యాలు, పోక్సో కింద నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసు అధికారులను సీపీ ఆదేశించారు. సైబర్‌ నేరాలపై రిపోర్టింగ్‌, సీఈఐఆర్‌ పోర్టల్‌ వినియోగం, సీసీ కెమెరాల జియో ట్యాగింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఆన్‌లైన్‌ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. మాదకద్రవ్యాలు, ఇసుక, పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు వాహనాల తనిఖీలను ముమ్మరం చేయాలని, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సక్రమంగా నిర్వహించాలన్నారు. కలెక్టర్‌ ప్రజావాణి, పోలీస్‌ కమిషనరేట్‌ ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను ప్రాధాన్యక్రమంలో పరిష్కరించాలన్నారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్‌ సోహం సునీల్‌, అదనపు డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్‌కుమార్‌, మాధవి, యాదగిరిస్వామి, శ్రీనివాస్‌, వేణుగోపాల్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2026 | 12:07 AM