Karimnagar : బీసీకే మేయర్ పీఠం
ABN , Publish Date - Jan 18 , 2026 | 01:03 AM
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్) కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఘట్టంలో మరో అడుగుపడింది. మేయర్, చైర్మన్, చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి.
- కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్
- ఎస్సీ మహిళలకు చొప్పదండి, హుజూరాబాద్
- జమ్మికుంట ఎస్సీ జనరల్
- ఖరారైన రిజర్వేషన్లు
- కరీంనగర్‌లో తాజా మాజీల డివిజన్లు గల్లంతు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఘట్టంలో మరో అడుగుపడింది. మేయర్, చైర్మన్, చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పలువురి ఆశావహుల అవకాశాలు గల్లంతుకాగా మరికొందరు పక్క స్థానాలకు వెళ్లి పోటీచేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవి బీసీలకు రిజర్వు అయింది. చొప్పదండి, హుజురాబాద్ మున్సిపల్ పీఠాలు ఎస్సీ మహిళలకు దక్కనున్నాయి. ఈ స్థానాలు ఎస్సీ మహిళలకు రిజర్వుకాగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ స్థానంగా ప్రకటించారు.కరీంనగర్ జిల్లాలోని ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలలో బీసీలు, ఎస్సీలు అధికారం చేపట్టనున్నారు. గతంలో ఈ స్థానాలన్నిటిలో ఓసీలే అధికారపగ్గాలు చేపట్టారు. రాజకీయంగా అన్ని పార్టీలకు పవర్‌సెంటర్‌గా ఉండే కరీంనగర్ కార్పొరేషన్‌లో మేయర్ పదవి చేపట్టాలనుకున్న పలువురి ఆశలు గల్లంతయ్యాయి. రిజర్వేషన్ అనుకూలించక కొందరు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతుండగా మరి కొందరు పక్క డివిజన్లు, వార్డుల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఫ కరీంనగర్ కార్పొరేషన్‌లో..
కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉండగా 15 జనరల్ స్థానాలుగా 18 జనరల్ మహిళల స్థానాలుగా ఉన్నాయి. బీసీ జనరల్ స్థానాలు 13, బీసీ మహిళల స్థానాలు 12, ఎస్సీ జనరల్ స్థానాలు నాలుగు, ఎస్సీ మహిళ స్థానాలు మూడు, ఎస్టీ జనరల్ స్థానంగా ఒక డివిజన్‌ను రిజర్వేషన్‌లో ఖరారు చేశారు. నగరంలోని 4వ డివిజన్ ఎస్టీ జనరల్‌గా రిజర్వు అయింది. 4,20,25,29 డివిజన్లు ఎస్సీ జనరల్ కాగా, 27,30,53 డివిజన్లు ఎస్సీ మహిళలకు రిజర్వు అయ్యాయి. బీసీ జనరల్ కేటగిరికి 10,14,31,32,34,36,37,39,46,58,59,61,63 డివిజన్లు దక్కాయి. బీసీ మహిళలకు 1,5,17,33,35,43,45,47,48,54,62,64 డివిజన్లు కేటాయించారు. డివిజన్ 2,6,8,16,18,21,22,23,24,26,42,50,51,65,66 డివిజన్లు అన్ జనరల్ అయ్యాయి. 1,5,17,33,35,43,45,47,48,54,62,64 డివిజన్లు జనరల్ మహిళలకు కేటాయించబడ్డాయి.
ఫ చొప్పదండి మున్సిపాలిటీల్లో 14 వార్డులు ఉండగా చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. 6వ వార్డు ఎస్టీలకు, ఒకటవ వార్డు ఎస్సీ జనరల్ స్థానాలుగా రిజర్వు కాగా, 4,5 వార్డులు ఎస్సీ మహిళలకు కేటాయించారు. 8,11 వార్డులు బీసీ జనరల్ కాగా, 14 వార్డు బీసీ మహిళలకు రిజర్వు అయ్యాయి. 9,10 వార్డులు జనరల్ కాగా, 2,3,7,12,13 వార్డులు జనరల్ మహిళలకు రిజర్వు అయ్యాయి.
ఫ హుజురాబాద్ మున్సిపాలిటీలో 1,4,8, 13, 16,18,20,23 వార్డులు జనరల్ మహిళలకు కేటాయించబడ్డాయి. 2,11,14,22,25,27 వార్డులు బీసీ మహిళలకు, 5,10,30 ఎస్సీ మహిళలకు, 15వ వార్డు ఎస్టీ జనరల్ కాగా, 6,7,9 వార్డులు ఎస్సీ జనరల్ అయ్యాయి. 3,12,17,19,24,26,29 వార్డులు జనరల్ కేటాయించారు. 21,28 బీసీ జనరల్‌గా రిజర్వు అయ్యాయి.
ఫ జమ్మికుంట మున్సిపాలిటీల్లోని 30 వార్డుల్లో 1,6,12 వార్డులు బీసీ మహిళలకు రిజర్వు అయ్యాయి. 2,3,13,14,15,20,22,25 వార్డులు జనరల్ మహిళలకు కేటాయించారు. 5,10,24 వార్డులు ఎస్సీ మహిళలకు రిజర్వు అయ్యాయి. 4,7,9,19,23,27,30 వార్డులు జనరల్ కాగా, ఎస్సీ జనరల్ స్థానాలుగా 8,16,17 వార్డులు కేటాయించారు. 11,21,26,28,29 వార్డులు బీసీ జనరల్, 18వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వు చేశారు.
ఫ పలువురు మాజీల ఆశలు గల్లంతు
మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులపై ఆశలు పెట్టుకొన్న పలువురు నేతల ఆశలు తాజా రిజర్వేషన్లతో గల్లంతయ్యాయి. కరీంనగర్ మేయర్ స్థానంపై ఆశలు పెట్టుకున్న జనరల్ అభ్యర్థులకు ఈ స్థానం బీసీ రిజర్వు కావడంతో అవకాశం లేకుండా పోయింది. జనరల్ అయితే తాజామాజీ మేయర్ వై.సునీల్‌రావు, వంగల పవన్‌కుమార్‌తోపాటు వివిధ పార్టీల్లోని సీనియర్ నాయకులు కూడా పోటీలో ఉంటారని ప్రచారం జరుగగా ఇప్పుడు వారు కార్పొరేటర్ పదవులకే పరిమితం కావలసిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు కార్పొరేటర్ పదవికి పోటీ చేయకుండా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. మేయర్ పదవి బీసీ జనరల్ అయితే ఆ స్థానాన్ని దక్కించుకోవాలని పలువురు మాజీ బీసీ కార్పొరేటర్లు ఆశించారు. మరికొందరు బీసీలు కొత్తగా పోటీచేస్తూ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో వ్యూహాలు రూపొందించుకున్నారు. అయితే వారువారు పోటీచేయాలనుకున్న డివిజన్ల రిజర్వేషన్లు మారడంతో వారి ఆశలు తలకిందులయ్యాయి. కొందరు డివిజన్ల రిజర్వేషన్లు మారడంతో బీసీ జనరల్ స్థానాలు ఉన్నచోట పోటీచేస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుంది, గెలుస్తామా లేదా అక్కడి ఓటర్ల సహకారం ఎంత వరకు ఉంటుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. తాజా మాజీ కార్పొరేటర్లు వాల రమణారావు, ఎడ్ల సరిత అశోక్ ప్రాతినిధ్యం వహించిన డివిజన్లతోపాటు సమీపంలోని డివిజన్లలో కూడా పోటీచేసే అవకాశం లేకుండా రిజర్వేషన్లు ఖరారు కావడంతో వారు ఈసారి పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే మరో కార్పొరేటర్ దిండిగాల మహేశ్ డివిజన్ మహిళా రిజర్వు కావడంతో ఆయన పోటీచేయలేని పరిస్థితి నెలకొన్నది. మేయర్ పీఠం బీసీ జనరల్ కావడంతో ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేశ్, చల్ల హరిశంకర్, వాసాల రమేశ్, మల్లికార్జున రాజేందర్ డివిజన్లు మహిళలకు రిజర్వు కావడంతో పక్క డివిజన్లలో పోటీ చేసేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ళ ప్రసాద్, పెద్దపల్లి జితేందర్, వి.రాజేందర్‌రావు డివిజన్లు మహిళా రిజర్వుడ్ కావడంతో వారి కుటుంబసభ్యులను బరిలో నిలుపాల్సి వస్తుంది. ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఔత్సాహికులకు వారి డివిజన్లు అనుకూలించక పోవడంతో నిరాశకు లోనయ్యారు. అయితే గతంలో మాదిరిగానే ఈసారి చాలా మంది తాజా మాజీ కార్పొరేటర్లకు డివిజన్లు రిజర్వు కావడంతో వారు మాత్రం మరోసారి పోటీచేసి సత్తాచాటుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు.