Share News

Karimnagar: డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ఆక్రమణకు యత్నం

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:01 AM

కరీంనగర్‌ రూరల్‌, జూలై 16 (ఆంద్రజ్యోతి): తీగలగుట్టపల్లిలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ఆక్రమణకు సీపీఐ నేతలు గురువారం యత్నించారు.

Karimnagar:  డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ఆక్రమణకు యత్నం

- సీపీఐ నాయకులను అడ్డుకున్న పోలీసులు

కరీంనగర్‌ రూరల్‌, జూలై 16 (ఆంద్రజ్యోతి): తీగలగుట్టపల్లిలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ఆక్రమణకు సీపీఐ నేతలు గురువారం యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు ఇళ్లు లేని పేదలతో కలిసి సీపీఐ నాయకులు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. అక్కడ మొలిచిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. ఆ ప్రాంతంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజకీయ లబ్ధి కోసం ఆలోచించకుండా ఇళ్లు లేని పేదలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చింతకుంటలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తీగలగుట్టపల్లి, చింతకుంటలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన పేదలకు అందజేయాలన్నారు. లేకపోతే సీపీఐ ఆద్వర్యంలో ఆక్రమించి పేదలకు పంచుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, జిల్లా కౌన్సిల్‌ సభ్యులు పద్మ, అంజలి, కార్యదర్శులు మురళీ, కసిబోజుల సంతోష్‌చారి, కాల్వ శ్రీనివాస్‌యాదవ్‌, రాజు, కొమురయ్య, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 12:02 AM