Share News

Karimnagar: దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి: కలెక్టర్‌ చిత్రా మిశ్రా

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:53 PM

సుభాష్‌నగర్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

Karimnagar:  దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి: కలెక్టర్‌ చిత్రా మిశ్రా

- కలెక్టర్‌ చిత్రా మిశ్రా

సుభాష్‌నగర్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. 256 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటికే వ్యవసాయశాఖ, విద్యాశాఖ అధికారులతో మొదటి సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈనెల 17న నిర్వహించే రెండో విడత సమావేశానికి సంబందించిన నివేదికలతో హాజరుకావాలని సంబందిత అధికారులకు సూచించారు. మంగళవారం జడ్పీ కార్యాలయంలో డీపీవో, డీఆర్‌డీవో అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పెండింగ్‌ కోర్టు కేసులు, దరఖాస్తులు, పెండింగ్‌ ఫైల్స్‌ క్లియర్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యత్వం వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌డీవో షర్మిల, కలెక్టరేట్‌ ఏవో సుధాకర్‌ పాల్గొన్నారు.

- హెలిప్యాడ్‌ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలి

నూతన కలెక్టరేట్‌ భవనం వెనుక భాగంలో ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్‌ నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన చేపట్టి, అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ చిత్రమిశ్రా సంబందిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సోమవారం కలెక్టర్‌ చాంబర్‌లో ఏవియేషన్‌, పోలీసు, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్‌ నిర్మాణ పనులపై అధికారులతో చర్చించిన కలెక్టర్‌ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. హెలిప్యాడ్‌ నిర్మాణానికి అనుకూలమైన స్థలాన్ని పరిశీలించినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం పర్యటనకు సంబందించిన అన్ని ఏర్పాట్లను శాఖల వారిగా సమీక్షిస్తూ పర్యటన విజయవంతం అయ్యేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌వో స్వామి, టౌన్‌ ఏసీపీ వెంకటస్వామి, ఆర్‌ అండ్‌ బి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ నరసింహాచారి పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 11:53 PM