Karimnagar: అండర్ పాస్ నిర్మించాలి..
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:16 AM
శంకరపట్నం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): శంకరపట్నం మండలం కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామాల మధ్య అండర్ పాస్ నిర్మించాలని రెండు గ్రామాల ప్రజలు ఆదివారం కొత్తగట్టు జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఆందోళన చేపట్టారు.
- కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామస్తుల ఆందోళన
శంకరపట్నం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): శంకరపట్నం మండలం కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామాల మధ్య అండర్ పాస్ నిర్మించాలని రెండు గ్రామాల ప్రజలు ఆదివారం కొత్తగట్టు జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ హైవే నిర్మాణంతో కొత్తగట్టు, గొల్లపల్లి రెండు గ్రామాలు రోడ్డుకు ఇరువైపులా విడిపోయాయని, రోడ్డు దాటాలంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇటీవల కొత్తగట్టు గ్రామంలో రోడ్డు దాటే క్రమంలో ముగ్గురు వ్యక్తులు ప్రమాదానికి గురై మృతి చెందారని గుర్తు చేశారు. పంట పొలాల వద్దకు వెళ్లాలన్నా, కిరాణా దుకాణాలకు, పిల్లలు స్కూళ్లకు వెళ్లాలన్న రోడ్డు దాటేందుకు మూడు కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తోందని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రోడ్డు ఎత్తుగా నిర్మించడంతో డ్రైనేజీ నీరంతా గ్రామంలోని ఇళ్లలోకి వస్తోందనిని, అధికారులు స్పందించి పరిష్కారం చూపేంత వరకు నిరవధిక దీక్షలు చేస్తామన్నారు. టోల్ ప్లాజా వద్ద ఆందోళన చేయడంతో ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం తెలుసుకున్న హుజూరాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని రెండు గ్రామాల ప్రజలకు నచ్చజెప్పి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలపడంతో ఆందోళన విరమించారు.