Share News

Karimnagar: డీఈవో కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:19 AM

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు గురువారం యత్నించారు.

 Karimnagar:   డీఈవో కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం

- కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలింపు

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు గురువారం యత్నించారు.స్టేడియం ప్రధాన ద్వారాన్ని మూసివేసి పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు గేటు దూకి కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగి సీఐ పుల్లయ్య కింద పడ్డారు. ఇతర పోలీసులు సీఐని లేపి ఏబీవీపీ కార్యకర్తలను వ్యాన్‌లోకి ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ విష్ణు మాట్లాడుతూ 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే నిర్ణయం సరికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని, విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. విద్యార్థులందరికి పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌, ఇతర సామాగ్రిని వెంటనే అందించాలన్నారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థికభారం మోపుతున్నందున ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బామండ్ల నందు, గోసుకుల అజయ్‌, ముసరి మురళి, చిప్ప యోగేష్‌, వంశీ, విగ్నేష్‌, విష్ణు, ఆకాష్‌, శేఖర్‌, యశ్వంత్‌, సాయిరాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 12:19 AM