karimnagar : 11 నిమిషాలు.. 1kg ఆభరణాలు దోపిడీ
ABN , Publish Date - May 04 , 2026 | 01:45 AM
కరీంనగర్ క్రైం, మే 3 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ నడిబొడ్డున.. పట్టపగలు జ్యోతినగర్ ప్రాంతంలోని పీఎంజే జ్యువెల్లరీ షాప్‌లో ఆదివారం భారీ దోపిడీ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది.
- కరీంనగర్‌లో కలకలం...
- పట్టపగలు పీఎంజేలో భారీ దోపిడీ
- పక్కా రెక్కీ... పథకం ప్రకారమే...
కరీంనగర్ క్రైం, మే 3 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ నడిబొడ్డున.. పట్టపగలు జ్యోతినగర్ ప్రాంతంలోని పీఎంజే జ్యువెల్లరీ షాప్‌లో ఆదివారం భారీ దోపిడీ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ కార్యాలయం.. మరో వైపు కోర్టు.. రెండు ప్రధాన కార్యలయాలకు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం 11.01కు పీఎంజే జ్యువెల్లరీ సిబ్బంది అప్పుడే లాకర్ నుంచి ఆభరణాలు తీసుకువచ్చి ర్యాక్స్‌లో సర్దుతున్నారు. ఇంతలో ఓ వ్యక్తి షాప్‌లోకి ప్రవేశించి తనకు 20 గ్రాముల బంగారం చైన్ కావాలని, మోడల్ చూపించాలని సిబ్బందిని అడిగాడు. సిబ్బంది అతడితో మాట్లాడుతుండగానే మరో నలుగురు షోరూంలోపలికి చొరబడ్డారు. ఐదుగురు కలిసి వారివద్ద ఉన్న తుపాకులు చూపించి సెక్యూరిటీగార్డును, సిబ్బందిని ఆభరణాలన్నీ అప్పగించాలని బెదిరించారు. షాప్‌లో ఉన్న ఎనిమిది మంది సిబ్బందిని చేతులుపైకి ఎత్తి కింద కూర్చోబెట్టారు.. ఆభరణాలను బ్యాగ్‌లో సర్దడం ప్రారంభించారు.
ఫ తిరగబడ్డ సిబ్బంది.. నాలుగు రౌండ్ల కాల్పులు
మార్కెటింగ్ మేనేజర్ ముస్తాక్‌అలీ ఎదురు తిరిగి ఒకరి తుపాకిని పట్టుకునే ప్రయత్నం చేయగా మిగతా సిబ్బంది కూడా దుండగులను ఎదిరించే ప్రయత్నం చేశారు. దీంతో దుండగులు ఒక్కసారిగా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. మేనేజర్ ముస్తాక్ అలీతోపాటు సిబ్బంది రాజేష్, కమలహాసన్, బూర్ల మధుకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఐదుగురు దుండగులు వారి వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో ఆభరణాలను సర్దుకుని షోరూం నుంచి పారిపోయారు. 11.01కి షోరూంలోకి చొరబడిన దుండగులు 11.12కి దోపిడీ ముగించుకుని అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం సిబ్బంది డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దాదాపు నాలుగు కోట్ల వరకు ఆభరణాలు దోపిడీ చేసినట్లు చెబుతున్నారు. దోపిడీకి పాల్పడిన ఐదుగురు దొంగలు ఒక పల్సర్ బైక్, మరొక అపాచీ బైక్‌పై విద్యానగర్ మీదుగా మల్కాపూర్ మార్గంలో పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద ఒక సెల్‌ఫోన్ పారేసినట్లు తెలిసింది. ఈ సెల్‌ఫోన్ జ్యువెల్లరీ షాపు ఉద్యోగిదిగా పోలీసులు గుర్తించారు. నిందితులు పారిపోతుండగా ఈ ఫోన్ తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ఫ ఉలిక్కిపడ్డ నగరవాసులు
జిల్లాలో ఎన్నో దొంగతనాలు, దోపిడీలు, ఇతర నేరఘటనలు జరిగినప్పటికీ దొంగలు ఆయుధాలతో కాల్పులకు పాల్పడిన ఘటనలు ఇంత వరకు చోటు చేసుకోలేదు. ఈ ఘటనలో నలుగురిపై దుండగులు కాల్పులకు పాల్పడడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కమిషనరేట్ కేంద్రంలో పట్టపగలు కాల్పులు, దోపిడీ ఘటన ప్రజల భద్రతను ప్రశ్నిస్తున్నది. ఈ ఘటనను పోలీస్ కమిషనర్‌తోపాటు అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇటీవల కొంత కాలం నుంచి కమిషనరేట్‌లో శాంతిభద్రతల విషయంలో కొంత అలసత్వం ఉన్నదనే విమర్శలు వస్తున్నాయి. దోపిడీ దొంగలు పథకం ప్రకారం ఎవరికీ అనుమానం రాకుండా కస్టమర్ రూపంలో ఒక్కొక్కరిగా షాపులోకి ప్రవేశించి, సిబ్బందిని మాటల్లోపెట్టి ఒక్కసారిగా వారికి ఆయుధాలు గురిపెట్టి, బెదిరించి, నిర్భంధించి దోపిడికి పాల్పడ్డారు. ఇది పాత నేరచరిత్ర కలిగినవారి పనిగా పోలీసు అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈ దోపిడీ ఘటనలో స్థానికుడు ఒకరు ఉండిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దోపిడి దొంగలు అంతరాష్ట్రముఠాకు చెందినవారుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాధారణంగా నేరస్థులు జైలుకు వెళ్లినప్పుడు అక్కడ ఒకరికి ఒకరు పరిచయం అవుతూ వారి వారి ప్రాంతాల్లో పెద్ద నేరాలకు పాల్పడిన సందర్బంలో స్థానిక నేరగాళ్ల సహాయం తీసుకుంటారని, ఇదే తరహాలో తెలుగుమాట్లాడిన ఒక నిందితుడు ఈ ముఠాతో చేయికలిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫ నాడు చొప్పదండిలో ఎస్‌బీఐలో ఉగ్రవాదులు..
గతంలో చొప్పదండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో.. ప్రస్తుతం కరీంనగర్ నడిబొడ్డున జ్యువెల్లరీ షాపులో బంగారం దోపిడీ ఘటన కలకలం సృష్టించాయి. ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే నిందితులు ముందుగానే రెక్కీ నిర్వహించి, పక్కా పథకం ప్రకారమే ఈ దోపిడీలకు పాల్పడినట్లు అర్థమవుతున్నది. 12 ఏళ్ల క్రితం 2014 ఫిబ్రవరి 1న చొప్పదండి ఎస్‌బీఐలో బ్యాంక్ తెరవగానే 10 గంటల సమయంలోనే దుండగులు లోపలికి చొరబడి మేనేజర్‌ను తుపాకీతో బెదిరించి లాకర్ తెరిపించి అందులో ఉన్న 46 లక్షల నగదు బ్యాగ్‌లలో సర్దుకుని రెండు బైక్‌లపై వెళ్లిపోయారు. ఆ బైక్ నెంబర్ల ఆధారంగా పోలీసులు విచారించగా ఆ రెండు బైక్‌లు నల్గొండలో చోరీ చేసినవిగా వెల్లడైంది. ఎస్‌బీఐలో 46 లక్షలు దోచుకుని బైక్‌లపై రైల్వేస్టేషన్‌కు వెళ్లి అక్కడే పార్క్‌చేసి రైలులో పారిపోయారు. మొదట పోలీసులు ఈ ఘటనకు పాల్పడింది దోపిడి దొంగలుగా బావించారు. ఆ తరువాత పశ్చిమ బెంగాల్‌లోని బర్ద్వానాలో 2014 అక్టోబర్ 1న ఒక ఇంటిలో పేలుళ్ల్లు జరిగి ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ సంఘటనపై అక్కడి పోలీసులు విచారణ జరపగా పేలుళ్ల సంఘటన స్థలంలో కొంత నగదు పట్టుబడగా కరెన్సీ కట్టలపై చొప్పదండి బ్యాంక్ లేబుళ్లు, ముద్రలున్నట్లు గుర్తించారు. దీంతో ఎన్‌ఐఏ అధికారులు విచారణ జరపగా అవి చొప్పదండి ఎస్‌బీఐలో దోపిడీ చేసిన డబ్బులుగా తేలింది. దీంతో చొప్పదండి సీఐని ఎన్‌ఐఉ అధికారులు ఢిల్లీకి పిలిపించి దోపిడీ కేసుకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు, వేలి ముద్రలు, బ్యాంక్ అధికారులతో జరిపిన సంభాషణ వివరాలను తీసుకుని పరిశిలించారు. చొప్పదండి ఎస్‌బీఐలో 46 లక్షల రూపాయల దోపిడీ సంఘటనకు పాల్పడింది జమాతే ఆల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులేనని ఎన్‌ఐఏ అధికారులు నిర్ధారించారు. జమాతే ఆల్ ముజాహిుుదీన్ అనే ఉగ్రవాద సంస్థ బ్యాంక్ దోపిడీకి పాల్పడే ముందు వారం రోజులుగా కరీంనగర్‌లోనే మకాం వేసి మల్యాల మండలం, కరీంనగర్‌లలోని పలు బ్యాంక్‌లను పరిశీలించి చివరకు చొప్పదండి ఎస్‌బీఐ వద్ద రెక్కీ నిర్వహించారని పోలీసుల విచారణలో వెల్లడైంది. అవారం రోజుల పాటు ఆ ఉగ్రవాదుల ముఠాకు కరీంనగర్‌లో ఎవరు ఆశ్రయం ఇచ్చారనే కోణంలో పోలీసులు విచారణ జరిపినప్పటికీ తేల్చలేకపోయారు. ఈలోగా బ్యాంక్ దోపిడీకి పాల్పడిన ముఠాకు చెందిన నలుగురు బ్లాస్టింగ్, ఎన్‌కౌంటర్లలో మృతి చెందడంతో ఆ కేసును మూసివేశారు. తాజాగా పీఎంజే జ్యువెల్లరీలో బంగారు ఆభరణాల దోపిడికి పాల్పడిన దుండగులు కొద్ది రోజులుగా రెక్కీ నిర్వహించిన అనంతరమే పక్కా ప్రణాళిక రూపొందించుకుని సెలవు రోజు, రద్దీ ఉండని ప్రాంతం, నీట్ ప్రవేశ పరీక్షలో పోలీసులంతా బందోబస్తు విధుల్లో ఉండగా ఈ దోపిడీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ రెండు దోపిడి ఘటనలు 10 నుంచి 15 నిమిషాల్లోనే పూర్తిచేసుకున్న దుండగులు అక్కడి నుంచి బైక్‌లపైనే పరారీ అయ్యారు. రెక్కీ నిర్వహించి కొద్ది రోజులు స్థానికంగానే ఉండే అవకాశముంది. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ జరపుతున్నారు.
ఫ పలు కోణాల్లో విచారణ
సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్, వేలిముద్రలు ఆధారంగా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. దోపిడీ జరిగిన పీఎంజే జ్యువెల్లరీలో దాదాపు నాలుగు గంటలపాటు క్లూస్‌టీం దుండగుల వేలి ముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. మరో వైపున పోలీసులు సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించి వారి భాషలను పరిశీలిస్తూ ఏ ప్రాంతానికి చెందినవారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దుండగుల్లో ఒక వ్యక్తి దోపిడి సమయంలో తన సెల్‌ఫోన్ నుంచి ఒక మెస్సేజ్‌ను పంపించినట్లు విచారణాధికారులు గుర్తించారు. దుండగులు సెల్‌ఫోన్‌ను వెంట తీసుకువచ్చినట్లుగా గుర్తించారు. సెల్ టవర్ డంపు ద్వారా దోపిడీ జరిగిన ప్రాంతంలో, ఆ 11 నిమిషాల సమయంలో కొత్త ఫోన్ నంబర్లను గుర్తించే పనిలో పోలీసులున్నారు. దుండగులు ఉపయోగించిన బైక్ నెంబర్లను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా నిందితులకు సంబంధించిన కొంత సమాచారం తెలిసే అవకాశం ఉన్నది. పది వరకు పోలీసు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి ఇలా పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. మరో వైపు నిందితుల ఫొటోలను సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల పోలీసులకు పంపించి అక్కడి పోలీసులను అప్రమత్తం చేస్తున్నారు. నిందితులు ఇదివరకు ఎక్కడైనా నేర ఘటనల్లో ఉన్నారా? అనేది పరిశీలిస్తున్నారు. పాత నేరస్థుల వేలిముద్రలతో జ్యువెల్లరీ షాపులో లభించిన వేలిముద్రలతో పోల్చిచూస్తున్నారు. జైళ్ల నుంచి ఇటీవల విడుదలైన దోపిడీ దొంగల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితుల ఫోటోలు స్పష్టంగా ఉండడంతో తప్పకుండా పట్టుబడుతారనే నమ్మకాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.