త్వరలోనే కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు పూర్తి
ABN , Publish Date - Mar 23 , 2026 | 12:25 AM
ప్రజల అభ్యున్నతి, రైతుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, త్వరలోనే కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రుద్రంగి, మార్చి 22(ఆంధ్రజ్యోతి) ప్రజల అభ్యున్నతి, రైతుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, త్వరలోనే కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి మండల కేంద్రం శివారులోని సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నతాధికారులతో, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కలికోట సూరమ్మ ప్రాజెక్టు కోసం రైతులు, పార్టీ నాయకులు కలిసి 37 నెలల పాటు ప్రతీ నెలా 22వ తేదీన ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు నిర్వహించి నిరసనలు తెలియజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల ఆశయాలను గౌరవిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంతరెడ్డి నాయకత్వంలో ఈ ప్రాజెక్టును ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో చేర్చి నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే సుమారు 43 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, గ్రామాల్లో చెరువులు నిండడంతో భూగర్భ జలాలు పెరిగి రైతులకు శాశ్వత ప్రయోజనం కలుగుతుందని వివరించారు. కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని రైతాంగానికి అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణకు సంబంధించి ఇప్పటికే సుమారు రూ.45.5 కోట్లను విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు, మిగతా నిధులను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాలువల నిర్మాణానికి అవసరమైన టెండర్లు పూర్తి కాగా, పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఆలస్యమైనా, ప్రస్తుతం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల రైతులకు వరప్రదాయినిగా మారుతుందని పేర్కొన్నారు. అలాగే, వేములవాడ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ, చెరువుల అభివృద్ధి, కాలువల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని మర్రిపల్లి ప్రాజెక్టు లచ్చంపేట కాలువ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజల అభ్యున్నతి, రైతుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి అతిత్వరలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన ఈఈ సంతూప్రకాష్, రుద్రంగి సర్పంచ గండి నారాయణ, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహనరెడ్డి, నాయకులు తర్రె మనోహర్, ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, పుట్కాపు మహిపాల్, ఎర్రం రాజలింగం, గడ్డం స్వామి, బోల్లి కూమార్, ఎర్రం ఆరవింద్, కట్కూరి దాసు, తదితరులు పాల్గొన్నారు.