జూన్.. కష్టాలు...
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:40 AM
జూన్ నెల వచ్చిందంటే చాలు.. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ఇదే నెలలో పాఠశాలలు, కళాశాలలు ఆరంభం కావడం, వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టనుండడంతో కావాల్సిన ఫీజులు, పెట్టుబడుల కోసం నానా తంటాలు పడాల్సి వస్తున్నది. తమకు వచ్చే డబ్బుల కోసం ఎదురు చూడకుండా కొందరు తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోవడంతో పాటు మరికొందరు అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు.
ప్రారంభంకానున్న పాఠశాలలు
పిల్లల చదువుల ఖర్చులు
సాగు కోసం రైతుల పెట్టుబడులు
పేద, మధ్య తరగతి
కుటుంబాలకు ఆర్థిక కష్టాలు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జూన్ నెల వచ్చిందంటే చాలు.. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ఇదే నెలలో పాఠశాలలు, కళాశాలలు ఆరంభం కావడం, వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టనుండడంతో కావాల్సిన ఫీజులు, పెట్టుబడుల కోసం నానా తంటాలు పడాల్సి వస్తున్నది. తమకు వచ్చే డబ్బుల కోసం ఎదురు చూడకుండా కొందరు తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోవడంతో పాటు మరికొందరు అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత యేటా జూన్ 12వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆరంభం కానుండగా, మొదటి వారంలో జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలతో పాటు ఇతరత్రా వృత్తి విద్యా కళాశాలలు కూడా ఆరంభం కానున్నాయి. ఈ సమయంలో తమ పిల్లలను పాఠశా లలు, కళాశాలలకు పంపించేందుకు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. పిల్లలకు మంచి చదువులు చదివించాలనే తాపత్రయం చాలా మంది తల్లితండ్రుల్లో ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఎలాంటి ఖర్చు లేకుండా విద్యాభ్యాసం అందే అవకాశాలున్నప్పటికీ, ఒకరిని చూసి మరొకరు మెజారిటీ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదివించేందుకు ఆరాట పడుతున్నారు. ఎన్ని డబ్బులైనా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. తమ వద్ద డబ్బులు లేకున్నా కూడా అప్పులు తీసుకవచ్చి ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు దోపిడీకి పాల్ప డుతున్నాయి. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తుండడంతోపాటు అదనపు ఫీజుల పేరిట దోపిడీ సాగిస్తున్నాయి. అంతేగాకుండా యూనిఫారాలు, టైలు, బెల్టులు, షూస్ దగ్గర నుంచి మొదలుకుని పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్కుల వరకు విద్యా సంస్థల్లోనే విక్ర యిస్తున్నారు. దీంతో తల్లితండ్రుల మీద తీరని భారం పడుతున్నది. ఫీజులను రెండు, మూడు విడతల్లో చెల్లించాల్సి ఉన్నప్పటికీ, ఒకేసారి చెల్లిస్తే, మొత్తం ఫీజులో 5 నుంచి 15 శాతం వరకు రాయితీలు ఇస్తుం డడంతో కొందరు మొత్తం చెల్లిస్తున్నారు. విద్యార్థులకు చెల్లించే ఫీజులు, పుస్తకాలు, నోట్ బుక్కులు, యూనిఫా రాలు, హాస్టల్ ఫీజులు చెల్లించేందుకు సన్నద్ధం అవు తున్నారు. డబ్బులు లేని వాళ్లు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతూ సమకూర్చుకుంటున్నారు.
ఫ రైతులకు పెట్టుబడుల భారం..
వ్యవసాయ రంగంలో ఖరీఫ్ సీజన్ జూన్ నుంచే ఆరంభం అవుతుంది. యాసంగిలో పంటలు కోసిన అనంతరం రైతులు వేసవి దుక్కులు దున్నుకుని వర్షాలు పడితే విత్తనాలు వేసేందుకు సిద్ధంగా ఉంటారు. యాసంగిలో పండించిన పంట ఉత్పత్తుల డబ్బులు సకాలంలో చేతికి రావడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో వరి విక్రయించిన రైతులకు మాత్రం రెండు, మూడు రోజుల్లోనే వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. మొక్కజొన్న రైతులకు ఇంకా డబ్బులు రాకపోగా, ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించిన ధాన్యం, మక్కలకు సంబంధించి డబ్బులు రైతుల చేతికి అందలేదు. దీంతో రైతులు పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సాగు కోసం కావాల్సిన విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు, దుక్కులు దున్నేందుకు ట్రాక్టర్ల కిరాయిలు, తదితర పెట్టుబడులకు డబ్బులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో బ్యాంకర్లు సకాలంలో పంట రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో తమ పిల్లల చదువు లకు కావాల్సిన ఫీజులు, యూనిఫారాలు, పాఠ్య పుస్త కాలు, హాస్టల్ ఫీజుల కోసం డబ్బులు అవసరం ఉం టున్నాయి. అటు.. వ్యవసాయంలో పెట్టుబడులు, ఇటు.. పిల్లల చదువుల కోసం డబ్బులు సమకూర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మానసికంగా ఒత్తిడి ఎదురవుతున్నారు. రైతులకు చెల్లించాల్సిన పంట ఉత్ప త్తుల డబ్బులు, బ్యాంకుల్లో సకాలంలో బ్యాంకు అధికా రులు పంట రుణాలు అందిస్తే రైతులు మానసిక ఒత్తిడి నుంచి దూరం కానున్నారు.