పదవి ఇవ్వనందుకే కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి రాజీనామా
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:50 AM
మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి రాజ్యసభ, ప్రభుత్వ సలహాదారు పదవులు ఇవ్వనందునే కాంగ్రెస్‌ను వీడారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌లు ఆరోపించారు.
ఫముఖ్యమంత్రిని విమర్శించడం తగదు
ఫమంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
జగిత్యాల, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి రాజ్యసభ, ప్రభుత్వ సలహాదారు పదవులు ఇవ్వనందునే కాంగ్రెస్‌ను వీడారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌లు ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌పార్టీ సమావేశం జీవన్‌రెడ్డి చేరిక సభనా లేక పార్టీ బహిరంగ సభనా కేటీఆర్, హరీష్‌రావు క్లారిటీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ 33జిల్లాల్లో ఎక్కడ బహిరంగ సభలు నిర్వహించు కున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా అడ్డగోలుగా అక్రమ సంపాదన చేసి, ఆ డబ్బుతో జగిత్యాల సభకు జనసమీకరణ చేస్తోందని ఆరోపించారు. కేవలం 10-12వేల మందితో సభ నిర్వహించుకునే స్థలంలో నియోజకవర్గానికి ఒక ఇన్‌చార్జిని నియమించి జనసమీకరణ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడడం బాధాకరంగా ఉందని, కానీ పార్టీ వీడుతున్న సమయంలో ఆయన చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు. జీవన్‌రెడ్డి సీఎంను విమర్శించడం తగదన్నారు. జగిత్యాల సభకు అధికారపార్టీ ఆటంకాలు కల్పిస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని తాను స్వయంగా కలెక్టర్‌కు చెప్పానని మంత్రి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఉండాలని రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి కోరుకుంటున్నారని తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, జీవన్‌రెడ్డి పార్టీమార్పుతో పెద్దగా జరిగే నష్టం ఏమీ లేదన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సహచరులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. అందుకే తాను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, మున్సిపల్ ఛైర్‌పర్సన్ సమిండ్ల వాణి, మాజీ చైర్మన్ గిరినాగభూషణం, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బండ శంకర్, పట్టణ అధ్యక్షుడు కొత్తమోహన్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.