బీఆర్‌ఎస్ వైపు జీవన్‌రెడ్డి చూపు
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:05 AM
జగిత్యాలకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
జగిత్యాల, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): జగిత్యాలకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈవిషయంలో జగిత్యాలకు చెందిన బీఆర్‌ఎస్ నేతలకు గులాబీ బాస్ కేసీఆర్ స్పష్టత ఇచ్చారని అంటున్నారు. కేసీఆర్ లక్కీ నంబరు ఆరు వచ్చేలా మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరే తేదీని ఖరారు చేశారన్న ప్రచారం జరుగుతోంది. జగిత్యాలలో సభ పెట్టి కేసీఆర్ సమక్షంలో జీవన్‌రెడ్డి కారెక్కనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో జీవన్‌రెడ్డి వెంట కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లకుండా అధికార పార్టీ నేతలు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లో త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి కేసీఆర్ సమక్షంలో జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.
ఫవ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న జీవన్‌రెడ్డి
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసిన జీవన్‌రెడ్డి కొన్ని రోజులుగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి నిత్యం జనంలోనే ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో ఏ పార్టీలో చేరుతారనే విషయమై ఎక్కడా జీవన్‌రెడ్డి నోరు విప్పలేదు. పలు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలోని జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, సారంగపూర్, రాయికల్ బీర్‌పూర్ తదితర మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజలను కలిసిన సమయంలో తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయడం లేదు. కానీ ఆయన సన్నిహితులు, కార్యకర్తలు మాత్రం జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరుతారని అంటున్నారు.
ఫబీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం..
జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్ నేతలతో ఇటీవల హైదరాబాద్‌లో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంలో భాగంగా దిశా నిర్దేశం చేయడానికి జగిత్యాల బీఆర్‌ఎస్ నేతలతో కేటీఆర్ ప్రయత్నాలు చేశారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. త్వరలోనే జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరుతారని, ఆయనతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని కేటీఆర్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత సురేశ్ తదితరులు కేటీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. జగిత్యాలకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణతో సైతం కేటీఆర్ సమావేశమై జీవన్‌రెడ్డి పార్టీలో చేరుతారని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ సైతం జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇందులో భాగంగా త్వరలోనే కేటీఆర్, హరీశ్‌రావులు జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈనెల చివరి వారంలో జరగనున్న బీఆర్‌ఎస్ ప్లీనరీ లోపు జీవన్‌రెడ్డి పార్టీలో చేరుతారన్న చర్చలు చోటుచేసుకుంటున్నాయి.
ఫబీజేపీలో చేర్చుకోవడానికి ఎంపీ అర్వింద్ యత్నం..
కాంగ్రెస్ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసిన జీవన్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకోవడానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ విషయమైన పార్టీ రాష్ట్ర, జాతీయ నేతలతో ఎంపీ అర్వింద్ చర్చించినట్లు సమాచారం. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం కలిగిన జీవన్‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా పలు ప్రయోజనాలు ఉండవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.
ఫ జీవన్‌రెడ్డికి మాజీ ఎంపీ కవిత ఫోన్..?
నిజామాబాద్ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఇటీవల జగిత్యాలకు చెందిన సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డితో సెల్‌ఫోన్‌లో సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీలో చేరాలనే అంశంపై తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని సూచించినట్లు సమాచారం. ఈనెల 25వ తేదీన రాజకీయ పార్టీని ప్రకటించనున్నామని.. తమతో కలిసి పనిచేయాల్సిందిగా జీవన్‌రెడ్డిని కల్వకుంట్ల కవిత ఆహ్వానించినట్లు ఆయన అనుచరవర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్, కొత్తగా పార్టీని ప్రకటించనున్న కల్వకుంట్ల కవిత తదితరుల నుంచి జీవన్‌రెడ్డికి ఆహ్వానం అందుతోందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు...ఏ పార్టీలో చేరుతారు...అనే చర్చ జిల్లాలో జరుగుతోంది.