Share News

Jagtial: వారసత్వ ఉద్యోగాలు కలేనా?

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:18 AM

కథలాపూర్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకుల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన జీవోలకు నేటికీ మోక్షం లభించడం లేదు.

 Jagtial:   వారసత్వ ఉద్యోగాలు కలేనా?

- మూడేళ్లుగా తప్పని ఎదురుచూపులు

- మరో ఉద్యోగం కోసం వెళ్లని వీఆర్‌ఏల వారసులు

కథలాపూర్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకుల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన జీవోలకు నేటికీ మోక్షం లభించడం లేదు. 61ఏల్లు పైబడిన వీఆర్‌ఏల కొడుకు లేదా కూతురుకు అర్హతల ఆధారంగా ఉద్యోగాలు కేటాయిస్తామని 81,85 జీవోలు జారీ చేశారు. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ జీవోలను అమలు చేయాలని ఎన్నిసార్లు వినతిపత్రాలు అందించినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు.

- జిల్లాలో 136మంది వీఆర్‌ఏల నిరీక్షణ..

2023లో 60 ఏళ్ల లోపు వయసున్న వీఆర్‌ఏలకు వారి అర్హతలను బట్టి వివిధ శాఖల్లో అటెండర్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఇచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో వారికి సంబంధించిన జీవోలోనే 61ఏళ్లు పైబడ్డ వీఆర్‌ఏలకు వారి వారసులకు అర్హతలను బట్టి ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో 61 ఏళ్లు పైబడి వయసున్న వారి వారసులు 136మంది ఉన్నట్టు తెలిసింది. వీరు అర్హతలతో పాటు వారసుల వివాదాలు లేవని నో ఆబ్జక్షన్‌ సర్టిఫికేట్లు కూడా తీసుకుని ప్రభుత్వానికి పంపించారు. దీంతో ఇంటర్‌, డిగ్రీ, పీజీలు చేసిన వారసులు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. తమకు వారసత్వ ఉద్యోగం వస్తుందనే ఆశతో మరో ఉద్యోగానికి వెళ్లకుండా ఎదరురుచూస్తున్నారు. కాగా వృద్ధాప్యంతో వయోభారంతో వీఆర్‌ఏలు పలు రెవెన్యూ కార్యాలయాల్లో స్వీపర్లు, అటెండర్లుగా ఇబ్బందికర పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. కొందరు అనారోగ్యంతో బాధపడుతూ కార్యాలయాలకు కూడా వెళ్లడం లేదు. కేవలం రూ.11 వేల చాలీచాలని వేతనంతో వారసులకు ఉద్యోగాలు లభిస్తాయనే ఆశతో విధులకు వెళ్తున్నారు. చాలామంది విధుల్లో ఉండగా మృతి చెందారు. దీంతో వారి వారసులకు పూట గడవడం కష్టంగా మారింది.

- వారసునికి ఉద్యోగం ఆశతో పనిచేస్తున్నా..

- పాలకాని సత్తయ్య, వీఆర్‌ఏ, అంబారిపేట

తాత, ముత్తాతల నుంచి వచ్చిన వీఆర్‌ఏ ఉద్యోగం రూ.30ల వేతనం నుంచి చేస్తున్నా. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 61ఏళ్లు పైబడిన వారి వారసులకు ఉద్యోగం ఇస్తామని మా వారసుల వివరాలు తీసుకుంది. వయసు పైబడ్డా చాలీచాలని వేతనంతో పనిచేస్తున్నా. కుటుంబాన్ని పోషించడం గగనంగా మారింది. తమ వారసులకు ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందనే ఆశతో పనిచేస్తున్నా. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం.

- మరో ఉద్యోగానికి వెళ్లలేక పోతున్నా..

- బత్తుల నరేశ్‌, సిరికొండ

మా నాన్నకు 61 ఏళ్లు పైబడి ఉండగా గత ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం తనకు ఉద్యోగం వస్తుందని ఆశతో ఉన్నా. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉన్నందు వల్ల వేరే ఉద్యోగంకు వెళ్ళలేని పరిస్థితిలో చిక్కుకున్నా. తనకు ఉన్న వారసులతో ఒప్పందాలు చేసుకున్న పత్రాలతో పాటు విద్యార్హతల సర్టిఫికేట్లు అప్పటి ప్రభుత్వం తీసుకుంది. 81,85 జీవోలను ఈ ప్రభుత్వం అమలు చేసి అర్హతల ఆదారంగా ఉద్యోగాలు అందించాలి.

Updated Date - Nov 15 , 2026 | 12:18 AM