Jagtial: అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:17 AM
మెట్‌పల్లి టౌన్, నవంబర్ 20 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతిఒక్కరికీ సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
- పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి
మెట్‌పల్లి టౌన్, నవంబర్ 20 (ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతిఒక్కరికీ సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మెట్‌పల్లి పట్టణంలో శుక్రవారం నిర్వహించిన నూతన సామాజిక భద్రతా పింఛన్ల మంజూరు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ బి సత్యప్రసాద్, వెలమసంఘ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పాల్గొని నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వపథకాల ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ సామాజిక భద్రతా పింఛన్లు వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా బీడీ కార్మికులు ఉన్నారని వారికి కూడా బీడీ పెన్షన్ మంజూరు చేయాలని మంత్రికి విన్నవించారు. కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ అర్హులైన వారిని గుర్తించి పింఛన్లు మంజూరు చేశామన్నారు. ఇంకా అర్హత ఉండి పింఛన్లు పొందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెలమ సంఘ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ పింఛన్ సొమ్మును అవసరాలకు ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జివాకర్ రెడ్డి, డీఆర్డీవో రఘువరన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌గౌడ్, చైర్మన్ మైలారపు లింబాద్రి, ఎంపీడీవోలు, తహసీల్దార్‌లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం
చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాజకీయ వాగ్వాదానికి వేదికైంది. కార్యక్రమం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ శ్రేణులు ‘జై నర్సింగరావు‘ అంటూ నినాదాలు చేయగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు ’జై సంజయ్‘ అంటూ నినాదాలు చేయడంతో సభాప్రాంగణం రాజకీయ నినాదాలతో మార్మోగింది. సమావేశానికి ముందు ఇరువర్గాల మధ్య నినాదాల పోటీ కాస్తా వాగ్వాదానికి దారితీసి, పరిస్థితి బాహాబాహీకి దిగేంత ఉద్రిక్తంగా మారింది. నాలుగురోజుల క్రితం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తాలూకు ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండగా, తాజాగా మంత్రి సమక్షంలో మరోసారి ఇరువర్గాలు వాగ్వాదానికి దిగడం పట్టణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాజకీయ ఆధిపత్య ప్రదర్శనతో సభలో గందరగోళం నెలకొంది. పరిస్థితులు తీవ్రం కావడంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ నాయకులకు సర్దిచెప్పి, వారిని సముదాయించారు. దీంతో నర్సింగరావుతో కలిసి సభ ప్రాంగణంకు చేరుకోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకు న్నారు. పెన్షన్ల పంపిణీ వేడుకలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు మెట్‌పల్లి రాజకీయ వాతావరణాన్ని మరోసారి వేడెక్కించాయి.