Jagtial: ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాస్తారోకో
ABN , Publish Date - Nov 27 , 2026 | 11:34 PM
గొల్లపల్లి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): అట్టహాసంగా కొనుగోలు కేంద్రంను ప్రారంభించి నెలరోజులు గడుస్తున్నా నేటికీ ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ మండలకేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
రైతులతో కలిసి ధర్నా చేసిన బీఆర్‌ఎస్ నాయకులు
గొల్లపల్లి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): అట్టహాసంగా కొనుగోలు కేంద్రంను ప్రారంభించి నెలరోజులు గడుస్తున్నా నేటికీ ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ మండలకేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన పార్టీనాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి స్థానిక స్వామి వివేకానంద విగ్రహం వద్ద జగిత్యాల-ధర్మారం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంబించింది. నాయకులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రంను నెల రోజుల క్రితం అట్టహాసంగా ప్రారంభించారని, ఇప్పటివరకు ఒక్క గింజ కొనుగోలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు యార్డులో పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైతులకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. అర్ధగంట సేపు ఆందోళన నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ మాజీద్ సంఘటనాస్థలికి వచ్చి మాట్లాడారు. సోమవారం నుంచి కొనుగోళ్లను ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండలశాఖ అధ్యక్షులు జలేందర్, ఏఎంసీ మాజీచైర్మన్ కాంపెల్లి హన్మాండ్లు, మాజీ వైస్‌చైర్మన్ ఆవుల సత్తయ్య, సర్పంచ్‌లు సల్లూరి శోభన్ గౌడ్, గోలి గంగారెడ్డి, సిద్దంకి లక్ష్మీమల్లారెడ్డి, నవ్వ అంజయ్య, చెందోళి సింగిల్‌విండో చైర్మన్ గందే వెంకటమాధవ రావు, బలభక్తుల కిషన్, చెవుల రవీంధర్, కోమల్ల జలేంధర్, గడ్డం రాజేందర్‌రెడ్డి, కనుకుట్ల లింగారెడ్డి, జనుప వెంకటేష్, రైతులు పాల్గొన్నారు.