Jagtial: రీ సర్వే పనులు వేగవంతంగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:12 AM
బీర్‌పూర్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రీ సర్వే పనులను పకడ్బందీగా వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు.
జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
బీర్‌పూర్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రీ సర్వే పనులను పకడ్బందీగా వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు. గురువారం మండలంలోని మోతీనగర్, డొంకేశ్వరం గ్రామాలలో నాన్ కెడస్ట్రాల్ రిసర్వే, ఎంజాయ్మెంట్ రీసర్వే పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామాలలో ఇప్పటివరకు ఎంత విస్తీర్ణంలో రీసర్వే పూర్తి అయిందని, ఇంకా ఎంతమేర చేపట్టాల్సి ఉందని రెవెన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వేనంబర్ల వారీగా ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంలో రీసర్వే నిర్వహించాలని సూచించారు. సర్వే పూర్తి అయిన అనంతరం భూవివరాలను ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు. మొదట గ్రామబౌండరీపై లైసెన్సుడ్ సర్వేయర్లు, మండల సర్వేయర్ కలిసి రీసర్వే చేస్తారని, తర్వాత ఒక్కొక్క రైతు వారిగా రీసర్వే నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలో మొదటివడతగా 70గ్రామాల్లో రీసర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. ప్రస్తుతం ఎంజాయ్మెంట్ రీ సర్వే కొనసాగుతుందని పేర్కొన్నారు. నడికుడ గ్రామంలో నాన్ కెడస్ర్టాల్ రీ సర్వే చేపడుతున్నామని అన్నారు. అనంతరం మండలంలోని తుంగూర్ గ్రామంలోగల కేజీబీవీ పాఠశాలను తనిఖీచేశారు. వంటలను, కిచెన్, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. నాణ్యమైన, రుచికరమైన భోజనం విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం, ఉపాధ్యాయులు బోధన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసుదన్, తహసీల్దాల్ సుజాత, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈవో నాగభూషణం, రెవెన్యూ పరిశీలకులు శ్రీనివాస్, సర్వేయర్ దయాకర్ సిబ్బంది పాల్గొన్నారు.