Jagtial: కాలం తెచ్చిన కరువు కాదు.. సీఎం తెచ్చిన కరువు
ABN , Publish Date - Jul 23 , 2026 | 11:20 PM
జగిత్యాల టౌన్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెచ్చిన కరువు అని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు.
బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల టౌన్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెచ్చిన కరువు అని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా బీఆర్‌ఎస్‌పార్టీ కార్యాలయంలో జడ్పీ మాజీచైర్ పర్సన్ దావ వసంత సురేష్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఎల్‌నినో ప్రభావంతో తల్లడిల్లుతుంటే, ఏవిధంగా అధిగమించాలని ఆలోచించకుండా, రేవంత్ రెడ్డి రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ, బాధ్యతగల నాయకుడిగా కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శించి, ప్రభుత్వా నికి సూచనలు చేస్తే, రేవంత్ రెడ్డి సానుకూంగా తీసుకోవాల్సింది పోయి, నిర్లక్ష్యం చేశారన్నారు. చంద్రబాబునాయుడు కాలంలో కరువు చూశాం.. ఆయన దారిలో నడిచే రెవంత్‌రెడ్డి వచ్చాక ఇప్పుడు కరువు వచ్చిందని అన్నారు. ఆరు నెలల ముందు నుంచే వాతావరణ నిపుణులు ఎల్‌నినో ప్రభావంపై సూచించినప్పటికీ ముందస్తు చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించి పంటకు రూ.20వేలు ఇవ్వాలని, భూములు లేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు వెంకటేశ్వర్‌రావు, కళ్లపెల్లి దుర్గయ్య, జున్ను రాజేందర్, శీలం ప్రవీణ్, గాజుల రాజేందర్, ఒల్లం మల్లేశం, శీలం సురేందర్, పుప్పాల అశోక్, నక్క జీవన్, మల్లారెడ్డి, సుధాకర్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ విలీనానికి వెంటనే అపాయింటెడ్ డే ప్రకటించాలి
ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో జాప్యం చేయకుండా వెంటనే అపాయింటెడ్ డే ప్రకటించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు జీవన్‌రెడ్డికి వినతిపత్రం ఆందజేశారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే అపాయింటెడ్ డేప్రకటించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆగస్టు 4న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి తన మద్దతు ఉంటుందని, తానుకూడా పాల్గొంటానని జీవన్ రెడ్డి తెలిపారు.