Jagtial: తీరుమారని బల్దియా రెవెన్యూ ఉద్యోగులు
ABN , Publish Date - Nov 27 , 2026 | 11:33 PM
జగిత్యాల టౌన్, నవంబర్ 27 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల మున్సిపల్ రెవెన్యూ విభాగంలో అవినీతి ఆరోపణలు వరుసగా వెలుగుచూస్తున్నా ఉద్యోగుల తీరు మారడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆస్తిపన్ను మదింపులో వరుసఅక్రమాలు
ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో సామాన్యుల ఫైళ్లు
పూర్తిస్థాయిలో విచారణ జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి
జగిత్యాల టౌన్, నవంబర్ 27 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల మున్సిపల్ రెవెన్యూ విభాగంలో అవినీతి ఆరోపణలు వరుసగా వెలుగుచూస్తున్నా ఉద్యోగుల తీరు మారడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విజిలెన్స్ తనిఖీల్లో ఆస్తిపన్ను మదింపులో అక్రమాలు బయట పడగా, కొద్ది రోజుల క్రితం కమిషనర్ సంతకం ఫోర్జరీ సంఘటన వెలుగు చూడగా.. తాజాగా ఓ ప్రైవేటు ఆసుపత్రి భవనానికి అంతస్తులు తగ్గించి ఆస్తిపన్ను తగ్గించిన వ్యవహారం కలకలం రేపింది. మరోవైపు సామాన్యుల పనులకు సంబంధించిన ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విజిలెన్స్ తనిఖీల్లోనూ అక్రమాలు..
గత ఏప్రిల్ 7న ఏసీబీకి అందిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం 30మంది విజిలెన్స్ అధికారులు పట్టణంలోని 67భవనాలను పరిశీలించగా మూడు నాన్ అసెస్మెంట్, 24పార్ట్ అసెస్మెంట్ కేసులతోపాటు మరో 32భవనాల్లో ఇతర వ్యత్యాలసాలను గుర్తించారు. ఈవ్యవహారంలో బాధ్యతలు నిర్వహించిన పదిమంది ఉద్యోగులకు నోటిసులు జారిచేసి కరీంనగర్‌కు విచారణకు పిలిచి స్టేట్‌మెంట్లు నమోదు చేశారు.
నెల రోజుల్లోనే తగ్గిన రెండు అంతస్తులు..
కరీంనగర్ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి భవనానికి 2022లో జీ+3 నిర్మాణ అనుమతి ఇచ్చారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఆరునెలలకు రూ.61,256 చొప్పున ఏడాదికి రూ.1,22,512 ఆస్తిపన్ను ఖరారు చేశారు. అయితే అక్టోబర్‌లో అదే భవనం రికార్డుల్లో జీ+1గా మారిపోయింది. రెండు ఇంటి నంబర్లు కేటాయించి ఆస్తిపన్నును ఏడాదికి రూ.47,748కు కుదించారు. కమిషనర్ డిజిటల్ కీ ద్వారా ఈ మార్పును ఆమోదించడం వివాదాస్పదమైంది. పన్ను తగ్గింపు వ్యవ హారంపై రెవెన్యూ విభాగానికి చెందిన ఆర్వో, ఇద్దరు ఇన్‌ఛార్జి ఆర్‌ఐలు, ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌కు కమిషనర్ షోకాజ్ నోటిసులు జారీచేశారు. అయితే సంబంధిత పేపర్లు, నోట్‌ఫైల్ కనిపించకపోవడం, నెలరోజుల్లోనే భవనం వివరాలు మారడం పలు అనుమానాలకు తావిస్తోంది. పన్ను తగ్గింపు కోసం రూ.2లక్షలకు పైగా ఒప్పందం కుదిరిందని, ఉద్యోగులు తలా కొంత వాట పంచుకున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. నోటీసులపై సదరు ఉద్యోగులు తమకు ఏమీ తెలియదని సమాధానం ఇవ్వడం కొసమెరుపు. ఇదిలా ఉండగా పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ఇలాంటి అక్రమాలు మరో 10నుంచి 12భవనాల్లోనూ బయటపడే అవకాశం ఉందని పట్టణంలో చర్చ జరుగుతోంది.
సామాన్యుల ఫైళ్లకు మోక్షమెప్పుడు?
ఒకవైపు పెద్ద భవనాల ఆస్తిపన్ను తగ్గింపులో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తుండగా, మరోవైపు సాధారణ ప్రజల ఫైళ్లు ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉంటున్నాయని బాధితులు వాపోతున్నారు. డబ్బులు ఇస్తే తప్ప రెవెన్యూ సెక్షన్‌లో ఫైళ్లు కదలడం లేదనే ఆరోపణలున్నాయి. సిటిజన్ చార్టర్ ప్రకారం నిర్ణీత గడువులో సేవలు అందించాల్సి ఉన్నా ఆచరణలో జాప్యం కొనసాగుతోంది. గతంలో విజిలెన్స్ విచారణలు, తాజాగా షోకాజ్ నోటీసుల జారీ అయినా బాధ్యులపై కఠిన చర్యలు కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది.