Share News

Jagtial: జిల్లాలో మోస్తరు వర్షం

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:08 AM

జగిత్యాల/టౌన్‌/కొడిమ్యాల/మల్యాల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జగిత్యాల జిల్లాలోని పలుప్రాంతాల్లో గురువారం స్వల్పంగా వర్షం కురిసింది.

 Jagtial:  జిల్లాలో మోస్తరు వర్షం

జగిత్యాల/టౌన్‌/కొడిమ్యాల/మల్యాల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జగిత్యాల జిల్లాలోని పలుప్రాంతాల్లో గురువారం స్వల్పంగా వర్షం కురిసింది. జిల్లాలో ఉదయం 8.30గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అత్యధికంగా జగిత్యాలలో 3.8మిల్లీమీటర్లు, అత్యల్పంగా సారంగపూర్‌లో 0.5మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షం కారణంగా జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాలకు స్వల్పంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. విద్యుత్‌సరఫరాకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. జగిత్యాల పట్టణంలోని 6వ వార్డు గోవింద్‌పల్లిలో కొత్తపేట నాగాలయం ఈవో విక్రమ్‌కు చెందిన మారుతి కారుతో పాటు మరో కారుపై వేపచెట్టు విరిగిపడింది. ప్రమాదసమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మల్యాల మండలంలో చెరువులు, కుంటలలోకి నీరు చేరుకుంది. మల్యాలలోని మార్కండేయ ఆలయం వద్ద గల చెరువు మత్తడి దూకుతోంది. వర్షంతో గ్రామాల్లోని రహదారులు బురదగుంతలతో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. తాటిపల్లిలో ఒర్రెలో ఇటీవల నిర్మించిన డ్రైనేజ్‌ రక్షణగోడ వర్షానికి కూలినట్లు గ్రామస్తులు తెలిపారు. నాసిరకం పనులు, ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే సైడ్‌వాల్‌ కూలి ప్రజాధనం వృథా అయిందని బీజేపీ నాయకుడు టైటస్‌ ఆరోపించారు.

అన్నదాత హర్షం..

అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఓ మోస్తరు వర్షం కురవటంతో కొడిమ్యాల వాగు పారుతున్నది. పంటలు ఎండిపోతాయేమోనని ఆందోళనలో ఉన్న రైతన్నలకు రాత్రి కురిసిన వర్షం ఊరటనిచ్చింది. కూరగాయలు, మొక్కజొన్న, కంది, పెసర, పసుపు, పప్పు దినుసుల పంటలతో పాటుగా మెట్ట పంటలకు అనుకూలమైన వర్షం కురిసిందని అగ్రివర్సిటీ సలహామండలి మాజీసభ్యుడు వెల్ముల రాంరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులు, వ్యవసాయశాఖ అధికారుల, శాస్త్రవేత్తల అభిప్రాయాలను తీసుకొని పంటలు పండించుకొని అధిక దిగు బడులను పొందాలన్నారు. ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి పి జ్యోతి మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున రైతులు పంటలపై ఎరువులు, పురుగుల నివారణ మందులను వాతావరణం చూసుకొని వేసుకోవాలన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 12:08 AM